రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సిద్ధం .. ఈ మధ్యాహ్నం భేటీ !

Update: 2020-12-01 08:30 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ  ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్‌ కొనసాగుతోంది. హర్యానా, ఢిల్లీ సరిహద్దులో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన భవన్‌లో చర్చలకు రావాలని రైతు సంఘాల నేతలకు సోమవారం రాత్రి ఆహ్వానం పంపారు. రెండు రోజుల కిందటే పలువురు కేంద్ర మంత్రులు రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రోజురోజుకి  పెరుగుతున్న చలి తీవ్రత, కరోనా‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రైతు సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించినట్లు కేంద్రమంత్రి తోమర్‌ చెప్పారు.

రైతులు తమ ఆందోళనను విరమించాలని సూచించారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వ్యవసాయమంత్రి సమావేశమయ్యారు. అన్ని విషయాలపై భేషరతుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కిసాన్‌ యూనియన్ అధ్యక్షుడు బుటా సింగ్‌తో అమిత్‌ షా మాట్లాడిన తర్వాత చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ముందస్తు షరతులు లేకుండా చర్చలకు ఆహ్వానించారని, అధికారిక ఆహ్వానం రాలేదని, వస్తే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదిలా ఉండగా రైతులు మాత్రం కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు చర్చించలేనివని, భారతీయ కిసాన్ యూనియన్  ప్రధాన కార్యదర్శి జగ్మోహన్ సింగ్ అన్నారు. గత ఆరు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు కేంద్రమంత్రితో జరిగే చర్చలతో సర్దుమణుగుతాయో లేదో చూడాలి. ఇదిలా ఉంటే , రైతులకి మేలు చేసే ప్రభుత్వం మాది అని ,రైతులకి కీడు చేయమని ,దశాబ్దాలపాటు సాగిన మోసపూరిత విధానాల వల్ల రైతులకు అలాంటి భయాలు, అనుమానాలు ఉండటం సహజమే అని, రైతులకు లబ్ది చేకూరేందుకే వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినట్టు ప్రధాని మోడీ చెప్పారు. 
Tags:    

Similar News