ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు జ‌గ‌న్ అభ‌యం!

Update: 2021-09-27 23:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్‌హాట్‌గా మారిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణపై రోజురోజుకూ కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార వైసీపీ నేత‌లు ఈ విష‌యంపైనే చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రివ‌ర్గంలో ఎవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంది? ఎవ‌రికి ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నారు? అనే విష‌యాల‌పైనే పార్టీ నాయ‌కులు జోరుగా మాట్లాడుకుంటున్నారు. త‌మ‌కు ఈ సారి మంత్రి ప‌ద‌వి క‌చ్చితంగా ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కంతో ఆశావ‌హులు ఉండ‌గా.. త‌మ ప‌ద‌వి ఉంటుందో? ఊడుతుందో? అన్న అనుమానంలో మంత్రులున్నారు. 2019లో మేలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌పుడే రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే సంక్రాంతి స‌మ‌యంలో కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిసింది.

నిజానికి జ‌గ‌న్ గ‌తంలో చెప్పిన దాని ప్ర‌కారం వ‌చ్చే నెలలోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. కానీ మ‌రో మూడు నెల‌ల పాటు జ‌గ‌న్ దానిని వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి మంత్రివ‌ర్గంలో స‌మూల మార్పు ఉంటుందా? పాత‌వాళ్ల‌లో కొంత‌మందిని ఉంచి.. కొంత‌మందిని తొల‌గిస్తారా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వంద శాతం మంత్రుల‌ను మార్చ‌బోతున్న‌ట్లు సంకేతాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యాఖ్య‌లు కూడా దీనికి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.  వైసీపీలోని కొంత‌మంది ముఖ్య నేత‌లు, సీనియ‌ర్ల‌తో జ‌గ‌న్ ఈ మేర‌కు చర్చ‌లు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో కొంద‌రికి మిన‌హాయింపు ఉంటుంద‌ని పార్టీలోని కీల‌క నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీరిలో కీల‌క‌మైన శాఖ‌ల బాధ్య‌త‌లు చూస్తున్న‌ జ‌గ‌న్‌కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కులు మంత్రులుగానే కొన‌సాగే వీలుంద‌ని చెబుతున్నారు.

అందులో ముఖ్యంగా కొడాలి నాని, పేర్ని నాని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ల మంత్రి ప‌ద‌వుల‌కు ఢోకా లేద‌ని జ‌గ‌న్ అభ‌యం ఇచ్చిన‌ట్లు టాక్‌. కొడాలి నానికి త‌న క‌మ్మ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. ప్ర‌త్యర్థిపై మాట‌ల‌తో విరుచుకుప‌డ‌డం ఎప్ప‌టిక్పుడూ జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉండ‌డం నానికి క‌లిసొస్తున్నాయి. మంత్రిగా ఎలా ప‌నిచేశార‌న్న విష‌యం ప‌క్క‌న‌పెడితే.. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఆయ‌న లాంటి బ‌ల‌మైన నేత వైసీపీలో మ‌రొక‌రు లేరు. దీంతో ఆయ‌న‌ను త‌ప్పించి మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఇద్దామ‌న్నా స‌రైన నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు.

ఇక  కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రుల్లో ఒక‌రిద్ద‌రు జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో కొన‌సాగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అందులో ఒక‌రు పేర్ని నాని అని పార్టీ శ్రేణులే కచ్చితంగా చెబుతున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి నాయ‌కుల విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టాలంటే పేర్ని నాని లాంటి నాయ‌కులు మంత్రివ‌ర్గంలో ఉండ‌డం అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ ఇద్ద‌రు నానీల‌ను జ‌గ‌న్ కొన‌సాగిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News