మంత్రొచ్చె... మొదలెట్టు... ?

Update: 2021-10-27 16:30 GMT
మనకు ఒక ముతక సామెత ఉంది. రెడ్డొచ్చె మొదలెట్టు అని. దాన్ని కాస్తా మార్చుకుంటే ఇలా చెప్పుకోవచ్చు అన్న మాట. ఏపీలోనే ఇలా ఎందుకు అంటే తొందరలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది అంటున్నారు. జగన్ ఇచ్చిన మాటను తప్పను అంటున్నారు. సరిగ్గా ముప్పయి నెలల పదవీ కాలం ముగిసిందీ అంటే మంత్రులకు మూడినట్లే అని కూడా చెప్పేస్తున్నారు. దాంతో ఇంతకాలం మంత్రి హోదా బుగ్గ కారూ అనుభవించిన వారంతా తెగ కలవరపడుతున్నారు. అదే టైమ్ లో ఆశావహులు మాత్రం కుర్చీ ఎక్కాలని ఉబలాటపడుతున్నారు. సరే జగన్ ఆనాడు చెప్పారు, మంత్రులను మార్చేసి కొత్తవారిని తీసుకుంటాను అని హామీ ఇచ్చారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఆయనది రాజకీయ నిర్ణయం ఆ విషయంలో జగన్ నెగ్గవచ్చు కూడా. ఎందుకంటే మంత్రులుగా ఎవరు ఉండాలి అన్నది రాజ్యాంగం ప్రసాదించిన అధికారం. అందువల్ల జగన్ ఎవరినైనా మంత్రులుగా చేసుకోవచ్చు. దాని వల్ల మరో పాతిక మందికి మంత్రి పదవులు దక్కుతాయి. వైసీపీలో కూడా చాలా మందికి ఛాన్స్ వస్తుంది.

అదే సమయంలో జనాలకు రాష్ట్రానికి ఏంటి లాభం అన్నదే చర్చగా ఉంది. అవును కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏపీ ప్రగతికి అది ఏ విధంగా ఉపయోగం అవుతుంది అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఎవరు మంత్రిగా ఉన్నా కూడా ఈ రోజుల్లో ప్రజలు పట్టించుకోవడం లేదు. మంచి చేస్తే ఎవరైనా దండం పెడుతున్నారు. చేయకపోయినా పెద్ద దండం పెడుతున్నారు. దాంతో ఈ విస్తరణ అన్నది ఫక్తు రాజకీయమే తప్ప జనాల వైపు నుంచి చూస్తే ఏమీ ఆశలు ఉండవనే చెప్పాలి. మరో వైపు చూస్తే మేధావులు, విజ్ఞులు మాత్రం తరచూ మంత్రి వర్గ విస్తరణల వల్ల లాభాలు కంటే నష్టాలు ఉంటాయ‌నే ఉటంకిస్తున్నారు.

అలా ఎందుకు అంటే ఒక శాఖలో మంత్రిగా కుదురుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఆ మీదట మెల్లగా పట్టు సంపాదించి రాష్ట్రానికి  అభివృద్ధి చేయాలన్నా కూడా మంత్రికి అనుభవం అవసరం. చూడబోతే  తొలి విడత రెండున్నరేళ్లలో మంత్రులుగా అయిన వారిలో ఒకరిద్దరు తప్ప అంతా కొత్తవారు. అయితే వారు ఈపాటికి ఎంతో కొంత అనుభవం సంపాదించారు. ఉదాహరణకు పోలవరం వంటి బహుళార్ధక ప్రాజెక్ట్ విషయంలో ఆ శాఖను చూస్తున్న మంత్రి అనిల్ కుమార్ కి ఇపుడు పూర్తి అవగాహన ఉంది. అలాగే ఆర్ధిక శాఖను చూస్తున్న బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి కూడా పట్టు పెరిగింది. ఇలాగే చాలా మంది శాఖల విషయంలో కసరత్తు చేసి సక్సెస్ అయ్యారు. రానున్న రోజులల్లో వారి పనితనం ఆధారంగా ఏపీకి ఎంతో కొంత మేలు జరుగుతుంది అనుకుంటే వారిని మాజీలు చేసి కొత్త వారిని కుర్చీలో పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్నదే మేధావుల ప్రశ్నట.

ఇక మరో వైపు చూస్తే కచ్చితంగా రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అందులో చివరి ఏడాది పూర్తిగా ఎన్నికల బిజీతో పోతుంది. అంటే కచ్చితంగా మిగిలేది ఏడాదిన్నర కాలమే. మరి ఈ తక్కువ టైమ్ లో ఆయా కీలకమైన శాఖల మీద పట్టు సంపాదించడం కొత్త  వారి వల్ల అయ్యేనా అన్నదే చర్చ.  ఇక జలవనరుల శాఖతో పాటు కొన్ని శాఖల విషయంలో పొరుగు రాష్ట్రాల్లో కూడా తేల్చుకోవాల్సిన విషయాలు వివాదాలూ  బోలెడు ఉన్నాయి. మరి ఉన్న  మంత్రులను మాజీలుగా చేస్తే కొత్త వారు  సబ్జెక్ట్ నేర్చుకుని రెడీ అయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది అంటున్నారు. అందుకే ఇపుడు ఏపీలో మంత్రొచ్చె మొదలెట్టు అన్న సామెతను అంతా వాడాల్సి వస్తుందేమో.
Tags:    

Similar News