గ్లోబల్ బ్రాండ్ గా ‘జియో’.. భారీ ఐపీవోతో తొలి అడుగు?
దేశ టెలికం రంగంలో పెను సంచలనానికి కారణమై.. ప్రజల జీవితాల్ని పూర్తిగా మార్చేసిన సంస్థగా జియోను చెప్పాలి.
దేశ టెలికం రంగంలో పెను సంచలనానికి కారణమై.. ప్రజల జీవితాల్ని పూర్తిగా మార్చేసిన సంస్థగా జియోను చెప్పాలి. కారుచౌకగా డేటాను అందించటం ద్వారా సామాన్యుడు సైతం సాంకేతికంగా ఒక అడుగు ముందుకు వేసేలా చేయటంలో రిలయన్స్ జియో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. టెలికం సేవల్లో అనేక సంచలనాలకు తెర తీసిన జియో.. ఇప్పుడు డిజిటల్ సేవలతో పాటు.. మరిన్ని కొత్త రంగాల్లో అడుగు పెట్టేందుకు వీలుగా భారీ విస్తరణ కార్యక్రమానికి తెర తీసింది. ఇందులో భాగంగా శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి అడుగు పెడుతున్న జియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లీన్ ఎనర్జీ.. కన్జూమర్ వ్యాపారాల్లో భారీ ప్లానింగ్ కు రిలయన్స్ తెర తీసినట్లుగా చెప్పాలి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో భారీ ఐపీవోకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా జియో సుపరిచితం. దీని ప్లాట్ ఫామ్స్ డైరెక్టర్ల బోర్డు భారీ ఐపీవోకు ఓకే చెప్పటం.. అందుకు తగ్గట్లే సెబీకి తమ భారీ ముసాయిదా పత్రాల్ని సెబీకి సమర్పించటం లాంటివి జరిగిపోయాయి. ఇదే విషయాన్ని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సగర్వంగా ప్రకటించారు.
ఈ ఐపీవో ప్రత్యేకత ఏమంటే.. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా రికార్డు క్రియేట్ చేయనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన జియో షేర్ ను ఏకంగా 27 కోట్ల మేర జారీ చేయనున్నారు. ఈ భారీ ఐపీవో ద్వారా జియో రూ.37,700 కోట్లను సమీకరించనుంది. ఇప్పటికే ఈ భారీ ఐపీవో గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తాను అనుకున్న లక్ష్యానికి చేరే విషయంలో జియో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా జియో మార్కెట్ విలువ దగ్గర దగ్గర రూ.13 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ భారీ ఐపీవో ప్రత్యేకత ఏమంటు ఇప్పటివరకు దేశంలో రూ.27,870 కోట్లతో హుందాయ్ అతి పెద్ద ఐపీవోకు వచ్చిన సంస్థగా నిలిచింది. ఈ మధ్యనే ఎన్ఎస్ఈ రూ.30వేల కోట్ల ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే జియో ఐపీవోకు వస్తున్నట్లుగా ప్రకటించటమే కాదు.. దీని ద్వారా ఏకంగా రూ.37వేల కోట్లకు పైనే నిధులు సమీకరిస్తామని చెప్పటంతో ఇప్పటివరకు ఉన్న రికార్డుల్ని చెరివేసేలా జియో గ్రాండ్ గా ఐపీవోకు రానున్నట్లు చెప్పాలి.
2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీవోగా దీన్ని చెప్పాలి. 2016లో సేవలు షురూ చేసిన జియో.. పదేళ్ల వ్యవధిలో దేశ టెలికం రూపురేఖల్ని సమూలంగా మార్చేసిందని చెప్పాలి. భారత్ లో మొబైల్ డేటా విప్లవాన్ని తీసుకురావటమే కాదు.. సామాన్యుడి దినచర్యను పూర్తిగా మార్చేసింది. టెలికం సేవలతో మొదలు పెట్టి.. క్లౌడ్ సర్వీసులు.. ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్లు.. ఏఐ ఇలా వివిధ రంగాల్లో విస్తరించటం ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ టెక్నాలజీ సంస్థగా అవతరించింది.
ఏఐ కార్యకలాపాల కోసం 2026 నుంచి రానున్న ఏడేళ్ల కాలంలో దాదాపు రూ.10 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇప్పటికే జియో లో మెటా.. గూగుల్.. కేకేఆర్.. జనరల్ అట్లాంటిక్ లాంటి దిగ్గజ సంస్థలు 20 బిలియన్ డాలర్లకు పైనే పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఆర్ ఐఎల్ కు 66.43 శాతం వాటా ఉండగా.. మెటాకు 9.99 శాతం.. గూగుల్ 7.73 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. ప్రతి భారతీయుడికి ఏఐని అత్యంత చౌకగా అందించటమే తమ లక్ష్యంగా ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. మొబైల్ డేటా విప్లవం మాదిరే ఏఐలోనూ విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. భారత్ కోసం భారత్ ద్వారా రిలయన్స్ రూపొందిస్తున్న ఏఐతో భవిష్యత్తులో ప్రపంచానికి కూడా సేవలు అందించనున్నట్లుగా చెప్పిన ఆకాష్ మాటలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో జియో గ్లోబల్ బ్రాండ్ గా అవతరిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అదే నిజమైతే.. అందుకు త్వరలో వచ్చే ఐపీవో కీలక అడుగుగా మారుతుందని చెప్పక తప్పదు.