వైర‌ల్ న్యూస్‌!.. సిద్దిపేట‌కు హ‌రీశ్ రిజైన్ త‌ప్ప‌దా?

Update: 2019-02-11 16:53 GMT
తెలంగాణ‌లో రెండో సారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు భ‌విష్య‌త్తు వ్యూహాలేమిటో ఆ పార్టీ నేత‌ల‌తో పాటు జ‌నానికి కూడా అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించి తాను సీఎంగా, మ‌హ‌మూద్ అలీని సింగిల్ మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయించి రెండు నెల‌లు కావస్తోంది. అయినా కూడా కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సింగిల్ మాట కూడా మాట్లాడ‌కుండా పార్టీ శ్రేణుల్లో అయోమ‌యాన్ని అంతకంత‌కూ పెంచేస్తున్న కేసీఆర్‌... ఆది నుంచి త‌న వెన్నంటి న‌డవ‌డంతో పాటుగా త‌న బ‌లాన్ని ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెంచేసిన త‌న సొంత మేన‌ల్లుడు హ‌రీశ్ రావు విష‌యంలో ఆయ‌న మౌనం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇటీవ‌లే త‌న మినిస్ట‌ర్ క్వార్ట‌ర్‌ను ఖాళీ చేసిన హ‌రీశ్ రావు త‌న సొంత ఇంటికి వెళ్లిపోతున్నా కేసీఆర్ సింగిల్ మాట కూడా మాట్లాడ‌లేదు. అదే స‌మ‌యంలో మ‌రో మాజీ మంత్రి తుమ్మ‌ల క్వార్ట‌ర్‌ను ఖాళీ చేస్తుంటే మాత్రం వ‌ద్ద‌ని వారించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం చూస్తుంటే... హ‌రీశ్ రావుకు కేబినెట్ లో బెర్తు లేద‌ని క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టేన‌ని చెప్పాలి.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త వార్త ప్ర‌కారం హ‌రీశ్ రావు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సిద్దిపేట‌కు కూడా రాజీనామా చేయాల్సి వస్తోంద‌ట‌. ఈ మేరకు కేసీఆర్ నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయ‌ని కూడా ఇప్పుడు సంచ‌ల‌న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. ఈ వార్త‌ల్లోని సారాంశాన్ని ఓ సారి చూద్దాం. త‌న కుమారుడు కేటీఆర్‌కు ఎదుర‌న్న‌దే లేకుండా చేసే క్ర‌మంలో హ‌రీశ్ రావును ఎంపీగా పోటీ చేయించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించార‌ట‌. మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే మెద‌క్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించార‌ట‌. ఈ క్ర‌మంలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల‌ని కూడా ఆయ‌న హ‌రీశ్ రావుకు ఆదేశాలు జారీ చేశార‌ట‌. దీంతో చేసేదేమీ లేక హ‌రీశ్ రావు రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డార‌ట‌.

అయితే సిద్దిపేట‌లో రికార్డు మెజారిటీతో విజ‌యం సాధిస్తూ వ‌స్తున్న హ‌రీశ్.. ఆ స్థానానికి రాజీనామా చేస్తే.. అక్క‌డ ఎవ‌రు పోటీ చేస్తారు? ఇంకెవ‌రు హ‌రీశ్ రావు స‌తీమ‌ణిని అక్క‌డి బ‌రిలోకి దింపేందుకు కేసీఆర్ దాదాపుగా ఓకే చేశార‌ట‌. ఈ త‌ర‌హా వ్యూహంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాను కూడా ఎంపీగా పోటీ చేసి ఎన్నిక‌లు ముగియ‌గానే... త‌న కొడుకు కేటీఆర్‌ను సీఎంగా చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టుగా ఈ వార్త‌లు చెబుతున్నాయి. ఈ విష‌యంపై  ఈ మేర ప్ర‌చారం ఎలా మొద‌లైంద‌న్న విష‌యానికి వ‌స్తే... కేసీఆర్ క‌జిన్, టీ కాంగ్ర‌స్ అధికార ప్ర‌తినిధి రేగుల‌పాటి ర‌మ్యారావు పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఈ ప్ర‌చారానికి నాందీ ప‌లికింద‌ట‌. త‌న ట్వీట్ లో రమ్యారావు ఏమ‌ని పేర్కొన్నారంటే... *మ‌రో నాలుగు నెల‌ల్లో సిద్దిపేటకు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. హ‌రీశ్ స‌తీమ‌ణి శ్రీ‌నిత అక్క‌డి నుంచి పోటీ చేస్తారు* అని ఆమె త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఆధారంగా ఇప్పుడు ఈ కొత్త త‌ర‌హా ప్ర‌చారానికి తెర లేసింది.

    

Tags:    

Similar News