బొత్స సంచలనం... రాజధానుల తరలింపు మొదలైపోయిందట

Update: 2020-02-08 04:01 GMT
నవ్యాంధ్రలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు ఎప్పుడు తరలిస్తారన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. హైకోర్టులో రాజధాని తరలింపుపై పలువురు పిటిషన్లు దాఖలు చేయడం, వాటిపై కోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరపడం, ఆ తర్వాత అన్నింటినీ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో... కోర్టులో పిటిషన్లు తేలేదాకా రాజధాని తరలింపు సాధ్యం కాదన్న మాట వినిపిఃస్తోంది. అయితే అది తప్పని... కోర్టులో కేసులు ఓ వైపు నడుస్తుండగానే... రాజధానిని మాత్రం తరలించేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలింపు ఎప్పుడో మొదలై పోయిందని కూడా బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపునకు సంబందించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా బొత్స ఏమాత్రం తడుముకోకుండా డీటైల్డ్ గా జరుగుతున్న తంతును బయటపెట్టేశారు. ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచే తరలింపు ప్రక్రియ కూడా మొదలైపోయిందని కూడా బొత్స సంచలన వ్యాఖ్య చేశారు. మరి కర్నూలుకు విజిలెన్స్ కమిషనరేట్ ను తరలించే దిశగా ఇచ్చిన జీవోపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది కదా అన్న ప్రశ్నకు సమాధానంగా... కోర్టు ఆదేశాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టు ఉత్తర్వులను తాము గౌరవిస్తున్నామని, అదే సమయంలో రాజధాని తరలింపు ప్రక్రియను కూడా ఎప్పుడో మొదలెట్టేశామని కూడా బొత్స చెప్పేశారు.

అయినా రాజధాని తరలింపునకు సంబంధించి హైకోర్టు లో విచారణ కొనసాగుతుండటం, ఇంకా కోర్టు నుంచి తుది తీర్పు రాని నేపథ్యంలో రాజధాని తరలింపు హైకోర్టుకు వ్యతిరేకమే కదా? అన్న ప్రశ్నకు బొత్స మరింత క్లారిటీగా స్పందించారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ పరిపాలనలో భాగంగా తీసుకున్నవే. ఈ నిర్ణయాలు తీసుకునే హక్కు, వాటిని అమలు చేసే హక్కు కూడా తమ ప్రభుత్వానికి ఉంది’’ అంటూ బొత్స తనదైన శైలి లో చెప్పుకుపోయారు. మొత్తంగా కోర్టులో దాఖలైన ‘రాజధాని’ పిటిషన్లపై విచారణ పూర్తి కాకుండానే రాజధాని తరలింపు ప్రక్రియ మొదలై పోయిందని బొత్స చెప్పడం నిజంగానే ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఈ నెల 26న జరిగే విచారణ సందర్భం గా రాజధాని తరలింపుపై హైకోర్టు ఏమంటుందో చూడాలి. 
Tags:    

Similar News