కర్ణాటకలో కాంగ్రెస్ ఆత్మహత్యకు కారణమిదేనట..

Update: 2018-05-15 06:44 GMT
అందరూ ఊహించింది జరగలేదు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి.. బీజేపీ ఖాతాలో కర్ణాటక చేరిపోయింది. కాంగ్రెస్ ఎంతో బలంగా ఉన్నా కూడా బీజేపీ గద్దెనెక్కడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఏమిటీ తేడా.. కాంగ్రెస్ ఎందుకు ఓడిందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ముఖ్యంగా లింగాయత్ ల విషయంలో సీఎం సిద్ధి రామయ్య తీసుకున్న వైఖరే ఆ పార్టీ కొంపముంచిందని తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా అయ్యాయి.

లింగాయత్ లకు మైనార్టీ హోదా కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అప్పట్లో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని సీఎం సిద్దిరామయ్య భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం వేరేలా వస్తున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే లింగాయత్ లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ లింగాయత్ లకు ఇచ్చిన హామీలు ఏ మాత్రం ఆ పార్టీకి కలిసి రావడంలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది. మొత్తంగా లింగాయత్ ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ కొంపముంచినట్టు అర్థమవుతోంది..
Read more!

ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.. ‘లింగాయత్ లను చీల్చిన రోజునే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆత్మహత్య చేసుకుందని’ వ్యాఖ్యానించారు. సున్నితమైన లింగాయత్ ల విషయంలో కాంగ్రెస్ వేలు పెట్టి ఫలితం ఇప్పుడు అనుభవిస్తోందని.. దీనంతటికి కాంగ్రెస్ సీఎం సిద్ధిరామయ్యే కారణమని సుబ్రహ్మణ్య స్వామి ఎద్దేవా గుప్పించారు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు కర్ణాటకలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఓటములపై ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు.

Tags:    

Similar News