అనటం ఎందుకు తిట్టించుకోవటం ఎందుకు?

Update: 2015-09-03 05:31 GMT
అవసరం లేని సమయంలో చేసే వ్యాఖ్యల కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువ. రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు కొన్ని మాటలు నడుస్తాయి. ఒకవేళ తొందరపడి వ్యాఖ్యలు చేసినా కూడా అధికార బలం ముందు అవి కొట్టుకుపోతాయి. కానీ.. కాలం ఏ మాత్రం అనుకూలంగా లేనప్పుడు చేసే వ్యాఖ్యల కారణంగా జరిగే నష్టం ఎక్కువే.

తాజాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. అప్పట్లో దివంగత మహానేత వైఎస్ లాంటి నేత.. కమ్యూనిస్టులను తోక పార్టీలుగా అభివర్ణించటం ఒక వ్యూహాత్మక ఎదురుదాడి. కానీ.. తాజాగా జ్యోతుల నెహ్రూ మాత్రం అవసరానికి మించి తొందరపడి పుసుక్కున మాట అనేసి మరి.. తిట్టించుకున్నారు.

పట్టిసీమ ప్రాజెక్టుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్న సమయంలో కలుగజేసుకున్న జ్యోతుల నెహ్రూ..''మీది తోక పార్టీ'' అంటూ వ్యాఖ్యానించారు. దీంతో.. సీరియస్ అయిన విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందిస్తూ.. ''మాది తోక పార్టీ అయితే మీ తోక కత్తిరించటానికి రెండు నిమిషాలు చాలు. ఇలాంటి వ్యాఖ్యలు జాతీయ పార్టీ అయిన మమ్మల్ని ఎలా అంటారు? కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం'' అంటూ వ్యాఖ్యానించారు.

ఏ దశలోనూ కేంద్రంతో పంచాయితీ పెట్టుకోవటానికి పార్టీ అధినేత జగన్ సిద్ధంగా లేని సమయంలో.. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు జ్యోతుల నెహ్రూ నోటి నుంచి రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయినా.. మాట అనటం ఎందుకు.. రెండు మాటలు అనిపించుకోవటం ఎందుకు?
Tags:    

Similar News