రామప్ప చుట్టూ రాజకీయం

Update: 2023-01-22 05:18 GMT
బీజేపీని, ఆ పార్టీని ఇరుకునపెట్టాలనే తాపత్రయంలో బీఆర్ఎస్ రాజకీయేతర మార్గాలనూ అనుసరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా వరంగల్‌లోని రామప్ప ఆలయం కేంద్రంగా రాజకీయం మొదలైంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్’ అనే సంస్థ మల్లికా సారాభాయి అనే ప్రముఖ నర్తకితో నృత్యప్రదర్శన ఏర్పాటుచేసి ఆర్కియాలజీ డిపార్టుమెంటును అనుమతి కోరింది.. అయితే.. మల్లికా సారాభాయి బీజేపీ వ్యతిరేకి కావడంతో ఆమె ప్రదర్శన వద్దని కిషన్ రెడ్డి చెప్పడంతో అనుమతులు రాలేదని ఈ ట్రస్టుకు సంబంధించిన వారు ఆరోపణలు చేస్తున్నారు.

అయితే.. ఇదంతా బీఆర్ఎస్ ఒక పద్ధతి ప్రకారం చేయించిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఫౌండర్ బీవీ పాపారావు. ఈయన ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. కేసీఆర్‌తో, బీఆర్ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి.

మల్లికా సారాభాయి కేవలం డ్యాన్సర్ మాత్రమే కాకుండా గుజరాత్ అల్లర్ల విషయంలో మోదీకి వ్యతిరేకంగా కేసులు వేసిన యాక్టివిస్ట్ కూడా. అంతేకాదు.. గాంధీనగర్‌లో అద్వాణీపై పోటీ చేసి ఓడిపోయారామె. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తరచూ బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతుంటారు.

బీజేపీని ఇరుకునపెట్టడానికే ఆమెతో ప్రదర్శన ఏర్పాటు చేసి అనుమతులు కోరారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశమిచ్చేదిగా ఈ వ్యవహారాన్ని వాడుకునేందుకు బీఆర్ఎస్ తెలివిగా ఇలా చేసిందనే విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణలో యామిని రెడ్డి వంటి ప్రముఖ శాస్త్రీయ నర్తకులు, మరికొందరు ప్రఖ్యాత డాన్సర్లు ఉండగా వారందరినీ వదిలి 70 ఏళ్ల వయసున్న మల్లికా సారాబాయిని ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. పైగా వయసుపైబడడంతో మల్లికా సారాభాయి చాలాకాలంగా ప్రదర్శనలు ఇవ్వడం లేదు.

దీంతో రామప్ప ఆలయం వేదికగా బీజేపీని, కిషన్ రెడ్డిని ఇరుకునపెట్టేందుకే బీజేపీ ఇదంతా చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News