ఖాతాలో రూ. 10 కోట్లు.. ఒక్క రూపాయి తీసుకోకుండా వెనక్కు ఇచ్చిన ఖాతా దారు..

రూపాయి దొరికితేనే వదిలిపెట్టని లోకంలో.. ఏకంగా 10 కోట్ల రూపాయలు తన ఖాతాలో పడినా, ఏమాత్రం ఆశపడకుండా ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న ఓ యువతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.;

Update: 2026-03-30 17:30 GMT

రూపాయి దొరికితేనే వదిలిపెట్టని లోకంలో.. ఏకంగా 10 కోట్ల రూపాయలు తన ఖాతాలో పడినా, ఏమాత్రం ఆశపడకుండా ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న ఓ యువతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒక సామాన్యురాలి ఖాతాలో అంత మొత్తం చేరడం, ఆమె భయపడకుండా, అత్యాశకు పోకుండా వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో జరిగిన ఈ వింత ఉదంతం, రీటా నిజాయితీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

10 కోట్ల షాక్

రీటాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. గత కొన్నేళ్లుగా ఆమె ఆ ఖాతాను నిర్వర్తిస్తోంది. ఆమె ఖాతాలో ఒక్కసారిగా రూ. 10 కోట్లు జమవడంతో ఆమె షాక్ కు గురైంది. అంత డబ్బు చూసి ఎవరైనా కలలు కంటారు, ఇల్లు కట్టుకోవాలి.. కారు కొనుక్కోవాలి.. లేదంటే పిల్లల చదువులను ఇలా చాలా కలలు కంటారు. ఇది మధ్య తరగతి గృహిణికి చాలా కామన్ ఆలోచనలు.. కానీ రీటా మాత్రం ఆ డబ్బులో రూపాయి కూడా విత్ డ్రా చేయలేదు.

పైగా సమస్య పరిష్కారమయ్యే వరకు ఆ డబ్బును ఎవరూ ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెప్పడం ఆమె నైతిక విలువలకు నిదర్శనం. పొరుగువారు, స్థానికులు ఆమె నిజాయితీని చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా, ఆమెను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

బ్యాంక్ అధికారుల స్పందన

ఈ ఘటనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందిస్తూ రీటాకు అభినందించారు. సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల పొరబాటున వేరే ఖాతాకు వెళ్లాల్సిన డబ్బు రీటా ఖాతాలోకి వచ్చి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చెందాల్సింది? అనే కోణంలో బ్యాంక్ అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. త్వరలోనే ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

సోషల్ మీడియా ఫిదా

రీటా ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమెను ఆకాశాని కెత్తుతున్నారు. ‘ఈ డబ్బు నాది కాదు, దీనిని వెనక్కి తీసుకోండి’ అని ఆమె స్పష్టంగా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ ఎక్స్ (X) యూజర్ శేఖర్ వెంబు స్పందిస్తూ.. ‘సాధారణ ప్రజల్లో అత్యధికులు నిజాయితీ పరులేనని, అందుకే మానవజాతి ఇంకా మనుగడ సాగిస్తోంది’ అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

పొరబాటున డబ్బు పడితే ఏం చేయాలి?

రీటా లాగే మీ ఖాతాలో కూడా ఎప్పుడైనా ఇలాంటి భారీ మొత్తం పడితే ఇలా చేయాలి. పొరబాటున వచ్చిన డబ్బును ఖర్చు చేయడం లేదా విత్‌డ్రా చేయడం చట్టపరమైన నేరం అవుతుంది. బ్యాంక్ దానిని రికవరీ చేసేటప్పుడు మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోతే మీరు చిక్కుల్లో పడతారు. మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. ఫోన్ ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా కూడా బ్యాంకుకు తెలియజేయవచ్చు. మీ ఖాతాలోకి డబ్బు వచ్చిన మెసేజ్ లేదా స్టేట్‌మెంట్ స్క్రీన్ షాట్స్ తీసి భద్రపరుచుకోవాలి. ఈ ఘటన సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. రీటా కష్టపడకుండా వచ్చిన 10 కోట్ల కంటే, తన నిజాయితీకే ఎక్కువ విలువ ఇచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఖాతాదారులు రీటా లాగా స్పందిస్తే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.

రూ. 10 కోట్లు అనేవి ఒక మనిషి జీవితాన్నే మార్చేయగలవు, కానీ రీటా ఆ డబ్బుతో కాకుండా తన 'నిజాయితీ'తో అందరి మనసు గెలుచుకున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం సమాజంలో నీతి, నిజాయితీలు బ్రతికే ఉంటాయని ఈ ఘటన నిరూపించింది. రీటా గారికి దక్కుతున్న ప్రశంసలు ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి దక్కిన అసలైన గౌరవం.

Tags:    

Similar News