పవన్ పోతేనేం.. బాహుబలి ఉన్నాడు!

Update: 2017-05-16 10:05 GMT
2014 ఎన్నికల ముంగిట జనసేన పార్టీ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పోటీకి దిగకుండా తెలుగుదేశం.. భారతీయ జనతా పార్టీలకు తన మద్దతు ప్రకటించాడు. ఐతే ఆ పార్టీలతో పవన్ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. రెండేళ్లు తిరిగేసరికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై.. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాడు పవన్. తెదేపా సర్కారుతో పోలిస్తే భాజపా ప్రభుత్వం మీదే పవన్ ఎక్కువగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ప్రత్యేక హోదా.. దక్షిణాదిపై వివక్ష లాంటి అంశాల్ని తెరమీదికి తెచ్చి భాజపాపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించాడు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీలోకి దిగబోతున్న నేపథ్యంలో పవన్ భాజపాకు మిత్రుడిగా ఉండే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు.

మరోవైపు తెలుగుదేశం పార్టీతోనూ భాజపాకు సంబంధాలు దెబ్బ తింటున్న నేపథ్యంలో సొంతంగా ఏపీలో ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఇందుకోసం కొత్త అస్త్రాన్ని తెరమీదికి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో భాజపా అగ్ర నేతల్లో ఒకరైన కృష్ణం రాజు ద్వారా ఆయన తమ్ముడి కొడుకు ప్రభాస్ ను తమ స్టార్ క్యాంపైనర్ గా రంగంలోకి దించాలని భాజపా భావిస్తోందట. ‘బాహుబలి’తో ప్రభాస్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ప్రభాస్ తో ప్రచారం చేయిస్తే కలిసొస్తుందని భాజపా భావిస్తోంది. కృష్ణం రాజు చెబితే ప్రభాస్ కాదనడని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు. కృష్ణం రాజును పెద్ద నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలబెట్టి.. పార్టీలోనూ ఆయనకు కీలక స్థానం అప్పగించి.. తద్వారా ప్రభాస్ ను ప్రచారంలోకి తీసుకొచ్చే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఐతే గతంలో ఒకసారి పెదనాన్న కోరిక మేరకు నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్న తనకు రాజకీయాలు అసలేం అర్థం కాలేదని.. ఆ దెబ్బతో మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లొద్దని అనుకున్నట్లుగా ప్రభాస్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పెదనాన్న కోరితే మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రచారానికి వస్తాడా అన్నది డౌట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News