48 సెకన్ల ఆ వీడియోలో ఆ సీఎం ఎంత రచ్చ చేశాడంటే?

Update: 2020-07-21 06:30 GMT
బీజేపీ ముఖ్యమంత్రులకు కాస్త భిన్నంగా కనిపిస్తారు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్. తన మాటలతో తరచూ వార్తల్లో దర్శనమివ్వటమే కాదు.. కొత్త చర్చకు తెర తీస్తుంటారు. మహాభారత సమయంలోనే ఇంర్నెట్ ఉందని.. మేడే రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఎందుకు? బాగా చదువుకున్న యూత్ సర్కారీ కొలువుల కోసం వెంపర్లాడకుండా ఆవుల్ని పెంచుకోవాలన్నారు. లేదంటే పాన్ షాపులు పెట్టుకోవాలంటూ తన నోటిమాటలతో సంచలనాలకు తెర తీసిన ఆయన.. తాజాగా అంతకు మించిన అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఎప్పుడు.. ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారో కానీ.. 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు రచ్చ రచ్చగా మారనుంది. తనకు ఏ మాత్రం సంబంధం లేని రాష్ట్రాలకు చెందిన వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారనున్నాయి. పలు రాష్ట్రాల ప్రజల మనోభావాలుదెబ్బ తినేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల క్లిప్ ను కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇందులో ఏముందంటే?
‘‘పంజాబీల గురించి మాట్లాడాల్సి వస్తే వారిని సర్దార్ అంటాం. వారికి తెలివి తక్కువగా ఉన్నా శారీరకంగా మాత్రం బలంగా ఉంటారు. వారిని ప్రేమ.. అప్యాయతలతోనే గెలవగలం. హర్యానాలో చాలామంది జాట్లు ఉన్నారు. వారికి మెదడు సరిగా పని చేయదు. అయితే.. వారు ఆరోగ్యంగా ఉంటారు. తెలివితేటల్లో మాత్రం బెంగాలీలతో సరితూగలేరు. బెంగాలీలు తెలివైన వారిగా భారతదేశమంతా గుర్తింపు ఉంది’’ అని పేర్కొన్నారు.

అయితే.. సీఎం విప్లవ్ దేవ్ ఈ వ్యాఖ్యల్ని ఏ సందర్భంలో ఏ వేదిక మీద చేశారో తెలియటం లేదు. ఈ వ్యాఖ్యల క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర సీఎం వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. బీజేపీ ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్.. పంజాబ్ లోని సిక్కు సోదరుల్ని.. హర్యానాలోని జాట్ సామాజిక వర్గాన్ని అవమానించారన్నారు.

తకు లభించిన అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోకూడదన్న భావనతో ఉన్న రణ్ దీప్.. తాజాగా బీజేపీని ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం.  బీజేపీ సీఎం వారిని అవమానించారు. మరి.. ఆ రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రులు. నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు. మోడీ.. నడ్డాలు ఎక్కడున్నారు? ఆ ప్రాంత ప్రజలకు వారు క్షమాపణలు కోరాలి. చర్యలు తీసుకోవాలి’’ అంటూ తన డిమాండ్ల చిట్టాను తెరిచారు. ఈ వీడియోలోని వ్యాఖ్యల పుణ్యమా అని రానున్న రోజుల్లో రాజకీయ రచ్చకు తెర తీయటం ఖాయమంటున్నారు.
Full View
Tags:    

Similar News