వెంకయ్యకు ఓటేయబోమన్న బీజేడీ

Update: 2017-07-18 15:42 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఒడిశాలోని బీజేడీ పార్టీ భారీ షాకిచ్చింది. నిన్న జరిగిన రాష్ర్టపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు పలికిన బీజేడీ ఒక్క రోజుకూడా తిరగకుండానే ఉప రాష్ర్టపతి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. దీంతో కమలనాథులకు గట్టి షాకే తగిలింది. అంతేకాదు.. రామ్ నాథ్ కోవింద్ కోసం పార్టీల మద్దతు కూడగట్టాం  కాబట్టి మళ్లీ ఇప్పుడు ఉప రాష్ర్టపతి అభ్యర్థి వెంకయ్య  కోసం ప్రత్యేకంగా అవసరం లేదనుకుంటున్న బీజేపీ తాజా పరిణామంతో కంగారు పడుతోంది.
    
అయితే.... రాష్ర్టపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి ఓట్లేసి మరునాడే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీనే తాము బలపరుస్తామని ప్రకటించడం వెనుక కారణాలను బీజేడీ చీఫ్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. గోపాల కృష్ణ గాంధీ తనకు చిరకాల మిత్రుడని... తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము స్నేహితులమని ఆయన చెప్పారు. ఆయన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప రాజకీయ కారణాలు కావని ఆయన స్పష్టం చేశారు.
Read more!
    
కారణమేదైనా బీజేడీ నిర్ణయం బీజేపీకి షాకిచ్చింది. ఎందుకంటే బీజేడీకి పార్లమెంటులో 28 మంది ఎంపీలున్నారు. ఒక్క లోక్ సభలో చూసుకున్నా అది అయిదో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చాలా కీలకం. అయితే.. కేంద్రంలోని బీజేపీ నేతలు దీనిపై ఏమీ స్పందించనప్పటికీ ఒడిశా బీజేపీ మాత్రం మండిపడుతోంది. కాంగ్రెస్‌తో బీజేడీ తెరవెనుక ఒప్పందం కుదుర్చుకుందని ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత పండా ఆరోపించారు.
Tags:    

Similar News