ఎవరీ బ్లింకెన్.. ప్రపంచం ఆయన గురించి ఎందుకు మాట్లాడుతోంది?

Update: 2020-11-24 04:00 GMT
అమెరికా అధ్యక్ష పదవికి ఉండే గ్లామర్.. గ్రామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక రకంగా విదేశీ విధానం విషయంలో ఆ స్థానంలో ఉన్న వారి పని తీరు ఆధారంగా.. వారి నిర్ణయాల పుణ్యమా పలు పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటి పవర్ ఫుల్ ప్లేస్ లోకి రానున్నారు ఆంటోనీ బ్లింకెన్. బైడెన్ సర్కారు కొలువు తీరిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రిగా ఆయన్ను ఎన్నుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

చాలా కాలంగా బైడెన్ కు విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా విదేశాంగ మంత్రి కావొచ్చని.. ఆయన అధికారిక ఎంపిక మంగళవారం జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. గతంలోనూ ఆయన కొన్ని కీలక పదవుల్నిచేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి వ్యవహరించిన ఒబామా ప్రభుత్వంలో డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పని చేశారు. అంతేకాదు.. బైడెన్ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు.. బ్లింకెన్ నేషనల్ అడ్వైజర్ గా కూడా వ్యవహరించారు.

మరి.. ఆయన భారత్ విషయంలో ఎలా ఉంటారు? ఎలాంటి వ్యవహారశైలి ఉంటుంది? ఆయన విదేశీ విధానంతో భారత్ కు లాభమా? నష్టమా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. భారత్ విషయంలో సానుకూలంగా ఉంటారని చెబుతున్నారు. అణుపరీక్షల వేళ భారత్ పై విధించిన ఆంక్షల తొలగింపులోనూ బ్లింకెన్ కీలక భూమిక పోషించినట్లుగా చెబుతారు. అంతేకాదు.. సివిల్ న్యూక్లియర్ డీల్ కుదరటంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతల్ని నిర్వర్తించిన వేళ.. విదేశీ వ్యవహారాల విషయంలో పలు దేశాలతో సంబంధాలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి వేళలో విదేశాంగ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్న బ్లింకెన్ కు బాధ్యతల బరువు భారీగా ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News