ఆ బిల్లుతో ప్రశాంత ఫ్రాన్స్ అట్టుడిగిపోతోంది

Update: 2020-11-29 06:30 GMT
ప్రశాంతమైన దేశంగా ఫ్రాన్స్ కున్న పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు. అందునా.. ఆ దేశ రాజధాని పారిస్ కు వెళ్లాలని.. అక్కడి అందాల్ని చూడాలని ముచ్చట పడే వారికి కొదవ ఉండదు. అలాంటి దేశం ఇప్పుడు అట్టుడిగిపోతోంది. ఆ దేశ సర్కారు తీసుకొచ్చిన ఒక బిల్లుతో ఫ్రాన్స్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయటమే కాదు.. అవి కాస్తా హింసకు దారి తీస్తున్నాయి.

తాజాగా పారిస్ లో నిరసనకారులు నిరసన వ్యక్తం చేయటమే కాదు.. ఖరీదైన బెంజ్ కార్లను తగలబెట్టేసిన వైనం సంచలనంగా మారింది. ఇంతకీ ఎందుకంత ఆగ్రహం అంటే.. దానికి కారణం లేకపోలేదు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటాన్ని బ్యాన్ చేస్తూ ఆ దేశ సర్కారు కొత్త బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టనుంది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఈ బిల్లును తీసుకురావాలన్న ఆలోచన ఫ్రాన్స్ ప్రభుత్వం ఎందుకు చేసిందన్న విషయంలోకి వెళితే.. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఒక నల్లజాతీయుడ్ని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం భద్రతా బిల్లును తీసుకొచ్చింది. అందులో డ్యూటీ చేసే పోలీసుల ఫోటోలు.. వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని పేర్కొన్నారు.

దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ బిల్లు పార్లమెంటు దిగువ సభ ఆమోదం పొందింది. సెనేట్ లో ఆమోదముద్ర పడాల్సి ఉంది. దీంతో.. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ప్రజలు నిరసన నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి.

విధినిర్వహణలో ఉన్న అధికారుల ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారికి ఏడాది జైలు.. 53వేల డాలర్ల భారీ జరిమానాను విధించాలని బిల్లులో పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News