70 ఏళ్లు బతికాడు...ట్రంప్ పై ఒబామా ఫైర్!

Update: 2016-07-28 07:39 GMT
ఈ నేలమీద ఆయన 70 ఏళ్లు బతికాడు.. ఏనాడూ కార్మికులను గౌరవించిన పాపాన పోలేదు. తన సంకుచిత భావజాలంతో అమెరికా ప్రజలను అమ్మేయగల సమర్ధుడు.. ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పి ప్రపంచం నుంచి అమెరికాను వేరే చేసేలా మాట్లాడటం ఆయనకు అలవాటు.. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు.. రెండు పర్యాయలు శ్వేతసౌధం అధిపతిగా ఉన్న బరక్ ఒబామా. తాజాగా తన సొంత పార్టీ డెమొక్రటిక్‌ జాతీయ సదస్సులో పాల్గొన్న ఒబామా... పార్టీ శ్రేణులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పై నిప్పులు చెరిగారు. ట్రంప్ తీసుకుంటాననే నిర్ణయాలపై ఫైరయ్యారు.

డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కు తన సంపూర్ణ మద్దతు అని ప్రకటించిన ఒబామా.. అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా - బిల్‌ క్లింటన్‌ కన్నా ఈమె ఎక్కువ అర్హురాలని ప్రకటించారు. ఇలా ఒకవైపు హిల్లరీని పొగుడుతూనే.. మరోవైపు ట్రంప్ పై తనదైన శైలిలో వాగ్భాణాలు సంధించారు. తాను రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పటికంటే.. హిల్లరీ అధ్యక్షురాలవుతుందనే ఆశతో అమెరికా భవిష్యత్తు పట్ల ఎప్పుడూ లేనంత ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. ఐ.ఎస్‌.ఐ.ఎస్‌.ను తుదముట్టించేవరకు హిల్లరీ విశ్రమించబోదని చెప్పిన ఒబామా.. కమాండర్ ఇన్‌ చీఫ్‌ పదవి చేపట్టేందుకు సైతం హిల్లరీ ఫిట్‌ గా ఉందని ప్రశంసించారు. ఇదే సమయంలో నేటితరం భవిష్యత్తును ఆమె కాపాడగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో.. అమెరికా ఇప్పటికే గొప్ప దేశం- శక్తిమంతమైన దేశం.. అలాంటి దేశం ట్రంప్‌ వంటి సంకుచిత భావజాలం గలవారిపై ఆధారపడాల్సిన ఖర్మ పట్టలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల కిందట ఇదే వేదికపై అధ్యక్ష అభ్యర్థిగా ప్రసంగించిన ఒబామా.. తాజాగా.. రెండు పర్యాయలు శ్వేతసౌధం అధిపతిగా పనిచేసిన ఒబామా గా ప్రసంగించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు!
Tags:    

Similar News