జగన్ కోర్టులో బంతి విడిచి వెళ్లిన బాలినేని?

Update: 2023-06-02 12:00 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి వీర విధేయుల్లో ఒకరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు. క్లీన్ చిట్ ఉన్న నేతల్లో బాలినేని పేరు ను చెబుతుంటారు. అలా అని పంచాయితీలు చేయరా? అంటే చేయరని చెప్పరు కానీ.. చేసే పనులు పద్దతిగా చేస్తారన్న పేరుంది. తన మంత్రి పదవిని తీసేసినా.. జగన్ కోసం కిమ్మనకుండా ఉండిపోయిన బాలినేని కి అధినేత మీద ఉన్న కమిట్ మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతారు. రాజకీయాల్లో తనకంటే జూనియర్ గా ఉన్న వారికి కీలక పదవులు ఉండి.. తన కు మాత్రం లేకపోవటం బాధించే విషయమే అయినా.. బయటపడకుండా ఉండిపోతున్న పరిస్థితి.

అయినప్పటికీ.. తనను అదే పనిగా టార్గెట్ చేస్తున్న తీరుతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం.. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తన వద్దకు పిలిపించుకొని సర్ది చెప్పినా.. కూడా ఆయన వెనక్కి తగ్గకపోవటం తెలిసిందే. తాను తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కానున్నట్లుగా చెప్పటం తెలిసిందే. తాజాగా ఆయన్ను తాడేపల్లికి పిలిపించుకున్న సీఎం జగన్.. ఆయనతో భేటీ అయ్యారు.

గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు బాలినేని. రీజనల్ కోఆర్డినేటర్ గా పదవికి రాజీనామా చేసిన సందర్భంలో జగన్ తో భేటీ అయిన ఆయన.. మీడియా ముందుకు రాకుండా వెళ్లిపోవటం.. తన స్పందనను ఎవరికీ తెలీకుండా జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం మాత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రీజనల్ కోఆర్డినేటర్ పదవి పై ఎలాంటి చర్చ జరగలేదని.. ప్రకాశం జిల్లా రాజకీయాల మీద మాత్రం అన్ని విషయాల్ని మాట్లాడినట్లు చెప్పిన బాలినేని.. జిల్లాలో తనకు ఇద్దరి విషయంలో మాత్రమే ఇబ్బంది ఉందన్న విషయాన్నిచెప్పినట్లుగా వెల్లడించారు. "జిల్లాలో ఇద్దరి విషయం లోనే ఇబ్బంది ఉంది. ఆ ఇద్దరి గురించి సీఎం జగన్ తో మాట్లాడా ను. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని చూస్తే.. బాలినేని కి సీఎం జగన్ హామీ ఇచ్చి ఉంటారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి తో తాను మాట్లాడిన మాటల్ని పూర్తిగా వెల్లడించకపోయినా.. తానేం చెప్పానన్న విషయం పై క్లారిటీ ఇవ్వటంతో పాటు.. జగన్ తనకు ఇచ్చిన మాట ను మీడియా ముఖంగా చెప్పటం ద్వారా.. బాలినేని తన సీనియార్టీ ని ప్రదర్శించారని చెబుతున్నారు. తాను ఇబ్బంది పడుతున్న ఇద్దరి గురించి సీఎం కు చెప్పానని మీడియాకు చెప్పటం ద్వారా..

ఆ ఇద్దరి పై జగన్ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితికి తీసుకొచ్చారని చెబుతున్నారు. బంతి జగన్ కోర్టులో వేసేసి.. తన దారిన తాను వెళ్లిన బాలినేని.. తనకు ఇచ్చిన మాట కు తగ్గట్లే చర్యలు తప్పక తీసుకునే పరిస్థితిని తీసుకొచ్చారంటున్నారు. మరి.. బాలినేని చెప్పినట్లే సీఎం జగన్ చేస్తారా? చర్యల కత్తి విదులుస్తారా? లేదంటే..యథాతధ స్థితిని అమలు చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Similar News