అసలుసిసలు ‘సింహ’ గర్జన ఇదేనట

Update: 2016-08-04 11:30 GMT
న్యాయంగా రావాల్సిన వాటి కోసం బతిమిలాడుకోవటం ఏమిటి? ప్రాధేయపడటం ఏమిటి? బిచ్చం అడుగుతున్నామా? న్యాయమైన వాటా అడుగుతున్నప్పుడు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందేగా.  ఆ మధ్యన గోపిచంద్ నటించిన సాహసం చిత్రంలో ఒక డైలాగ్ తరచూ చెబుతుంటాడు. ‘‘నాది కానిది కోటి రూపాయిలైనా నాకు అక్కర్లేదు. నాదైనది అర్థరూపాయి కూడా వదలిపెట్టను’’ అని. న్యాయంగా.. ధర్మంగా రావాల్సిన వాటి విషయంలో కేంద్రం తొండి ఆడితే.. ఏవేవో కారణాలు చెబుతూ.. పరిణామాల్ని వెతుక్కుంటూ నిర్మోహమాటంగా మాట్లాడని వైనం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో కనిపిస్తుంది.

అదే సమయంలో.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా సరే సిద్ధమన్నట్లుగా వ్యవహరించే తీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా సిద్ధమన్నట్లు మాట్లాడే ఆయన.. మొన్నటికి మొన్న హైకోర్టు విభజన ఇష్యూలో.. తాను ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానంటూ అనేశారు. అదే కేసీఆర్.. కేంద్రం తనతో మాట్లాడి.. బలమైన హామీ ఇచ్చిన తర్వాత తన మాటల దాడిని తగ్గించారు. మోడీ ఏదో చేస్తారు? కేంద్రంతో తగాదా పెట్టుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది.. వచ్చే నిధులు రావేమో లాంటి దూరపు ఆలోచనలకు పోకుండా.. రాష్ట్ర ప్రయోజనం కోసం ఎంతకైనా మాట్లాడతారు.. మొండిగా ఉంటారన్నట్లుగా వ్యవహరించటం చాలా అవసరం. నిజానికి అలాంటి వారి విషయంలోనే మోడీ అండ్ కో జాగ్రత్తగా ఉండటం కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు చంద్రబాబులో అలాంటివి కనిపించని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. అనవసరంగా మాట్లాడే తత్వం లేని బాలకృష్ణ అగ్గిబరటాల మాట్లాడటం.. తనదైన శైలిలో పిడుగుల్లాంటి మాటల్ని చెప్పేయటం చూసినప్పుడు.. అసలుసిసలు సింహం అన్నట్లుగా పలువురు అనుకోవటం కనిపిస్తోంది. సినిమాల్లోనే కాదు.. అవసరమైనే రియల్ లైఫ్ లోనూ ఘాటు డైలాగులు పేల్చగల సత్తా తనలో ఉందన్న విషయాన్ని బాలకృష్ణ స్పష్టం చేశారని చెప్పాలి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. మరే ఏపీ నేతకు చేతకాని రీతిలో ఆయన కేంద్రంపై వ్యాఖ్యలు చేయగలిగారన్న పొగడ్తల్ని సొంతం చేసుకుంటున్నారు.

మాటల్లో ఫ్లో లేకున్నా.. ఆయన వాడిన పదాలు సీమాంధ్రుల్ని ఉత్తేజితుల్ని చేసేలా ఉండటం గమనార్హం. ‘‘మనం అప్పుడప్పడూ అంటుంటాం. దేనికో ఈ దిక్కుమాలిన జోహార్లు. దేనికో సిగ్గులేని దేబిరింపులు.. ఏలకో రాయబారమని బేలమవుదము.. ఎందుకో రాష్ట్ర లబ్థి కోసం ఇంత రగడ’’ అంటూ సాగిన ఆయన మాటల దాడి.. ‘‘యాచన అన్నదే ఎరుగని ఆంధ్రరాష్ట్రం ఎంత దిగజారిపోయింది. ఎంత వింత సిగ్గుచేటు.. ఇదిగో.. మన భుక్తి మన చేతియందే గలదు. ముష్టి ఎత్తుకొనుటయందు కాదు’’ అంటూ ఫైర్ అయిన తీరు ఇప్పుడు కొత్త సంచలనానికి తెర తీసిందని చెప్పాలి.

ఎమ్మెల్యేగా రెండేళ్ల నుంచి వ్యవహరిస్తున్నా.. ఎప్పుడూవివాదాస్పద వ్యాఖ్యలు చేయని బాలకృష్ణ.. ప్రత్యేక హోదా మీద తనకున్న అసహానాన్ని.. కేంద్రం తీరును ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారని చెప్పాలి. ‘అనాడు నాన్నగారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం.. తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పి.. దాన్ని నివారించటానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇవాల్టి ఆహారభద్రత లాంటివి అప్పట్లోనే మనం శ్రీకారం చుట్టాం. ప్రజలను అలరించటానికి ఏవో ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. వాళ్లు తగిన శాస్తి అనుభవిస్తారు. నా అభిప్రాయం నేను చెప్పా’’ అంటూ తేల్చేశారు. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు విన్న పలువురు తెలుగు తమ్ముళ్లు అసలుసిసలు సింహం బాలయ్యే అంటూ పొగడ్తలు కురిపించటం విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News