పది మంది ఎమ్మెల్యేలు.. మరోసారి అదేమాట!

Update: 2019-08-23 11:59 GMT
తనతో పది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఇది వరకే ప్రకటించి ఆశ్చర్యపరిచిన మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి ఆ విషయాన్ని ప్రకటించారు.  తనతో పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నది ముమ్మాటికీ వాస్తవమే అని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారు వచ్చి చేరడానికి రెడీ అని అవంతి స్పష్టం చేశారు.

ఆ పది మంది ఎవరో ఇప్పటి వరకూ అవంతి చెప్పలేదు. అయితే ఆయన మరోసారి అదే వ్యాఖ్య చేయడం ఆసక్తిదాయకంగా మారింది. అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వలస వెళ్లడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది.  అయితే తమ పార్టీలోకి వచ్చే వారు ఎవరైనా ఎమ్మెల్యే పదవికి లేదా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. దీంతోనే ఏపీలో ఎమ్మెల్యేల-ఎంపీల ఫిరాయింపులు జరగడం లేదనేది బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు మాత్రం ఆసక్తిని రేపుతూ ఉన్నాయి.

ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనా చౌదరి పై అవంతి విరుచుకుపడ్డారు. రాజధానిని మారిస్తే విప్లవం వస్తుందని సుజనా వ్యాఖ్యానించడంపై అవంతి ఫైర్ అయ్యారు. రాజధానిని మారిస్తే కాదు - వరద బాధితులకు కేంద్ర సాయం అందించకపోతే విప్లవం వస్తుందని సుజనా చౌదరి గ్రహించాలని అవంతి చురకలు అంటించారు.

అంతలా మాట్లాడేస్తున్న సుజనా చౌదరి ఇంతకీ తెలుగుదేశం పార్టీనా - భారతీయ జనతా పార్టీనా..అంటూ మంత్రి సందేహాన్ని వెలిబుచ్చారు.


Tags:    

Similar News