హైదరాబాద్ లో అలానా? మాస్కు పెట్టుకోలేదన్న పోలీసుపై రాయితో దాడికి యత్నం?

Update: 2021-05-26 11:30 GMT
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ లాక్ డౌన్ విధించటం.. కొవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటించాలని కోరటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించటమే కాదు.. నిబంధనలు పాటించటం లేదని అడిగినందుకు.. పెద్ద రాయితో పోలీసులపైనే దాడికి యత్నించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా.. అంతకు మించిన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ లోని ఇమాద్ నగర్ కు చెందిన ఇద్దరి యువకుల తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేసింది. కొవిడ్ నిబంధనల్ని పాటించకుండా హెల్మెట్ ధరించకుండా.. ఆ మాటకు వస్తే ముఖానికి మాస్కు పెట్టుకోకుండా టూవీలర్ మీద వచ్చిన యువకుడ్ని అక్కడి గస్తీ ఉన్న పోలీసులు ఆపారు. ఆ యువకుడ్ని ఆపిన పోలీసు ప్రశ్నిస్తున్న వేళలో.. ఆ యువకుడి సోదరుడు రాయి తీసుకొని పోలీసులపై దాడికి ప్రయత్నం చేశాడు. అయితే.. అప్పటికే సదరు పోలీసుతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లు కూడా ఉండటం.. వారంతా చేరటంతో ఆ యువకుడు వెనక్కి తగ్గాడు.

పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా.. దురుసుగా వ్యవహరించటం ఒక ఎత్తు అయితే.. నిబంధనల్ని పూర్తిగా విస్మరించి.. పోలీసుల మీద దాడికి యత్నించిన యువకుడ్ని.. అతడి సోదరుడ్ని పోలీసులు ఫోటోలు.. వీడియోలు తీశారే కానీ.. అదుపులోకి తీసుకోలేదు. నిబంధనల్ని ఉల్లంఘించిన కేసుల్లో వాహనాల్ని సీజ్ చేయటం.. చలానా విధించటం లాంటివి చేస్తారు.

తాజా ఉదంతంలో మాత్రం ఇద్దరిని హెచ్చరించటం పంపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. 55 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోనుచూస్తే.. హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. చట్టాన్ని ఉల్లంఘించటమే కాదు.. పట్టపగలు.. నడిరోడ్డు మీద పోలీసు మీద రాయితో దాడికి యత్నించిన యువకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. పోలీసులు ఏం చేస్తారో చూడాలి.




Full View
Tags:    

Similar News