డెడ్ బాడీ డోర్ డెలవరీ కేసు.. నలుగురు పోలీసులు బలి!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి నలుగురు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.;

Update: 2026-02-22 12:58 GMT

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి నలుగురు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసులో నిందితుడు అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించి, డీఫాల్ట్ బెయిలు లభించేలా సహకరించారన్న ఆరోపణలపై నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2022లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరుగగా, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని, నిందితుడితో కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ మృతుడి తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రెండు రోజుల క్రితం పోలీసుల పనితీరునుు తప్పుపడుతూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

డ్రైవర్ హత్య కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఐదేళ్లు అవుతున్నా ఫైనల్ చార్జిషీటు దాఖలు చేయకుండా పోలీసులు నిందితుడికి సహకరించేలా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అంతేకాకుండా ఏపీ పోలీసులకు చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని తేల్చిచెప్పింది. డ్రైవర్ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. డీజీపీ పనితీరును నిలదీసింది. దీంతో ప్రభుత్వం గట్టి చర్యలకు దిగిందని అంటున్నారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాల సేకరణలో విఫలమవడంతోపాటు నిందితుడికి డీఫాల్డ్ బెయిలు లభించడానికి కారణమైన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిందిగా డీజీపీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్పీగా పనిచేస్తున్న భీమారావు, డీఎస్పీ మురళీకృష్ణరెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్పై సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. కేసు విచారణలో లోపాలకు ఈ నలుగురిదే బాధ్యతగా డీజీపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో నలుగురు పోలీసులను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏఎస్పీతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్ఐ సస్పెన్షన్ పోలీసు శాఖలో విస్తృత చర్చకు దారితీసింది. ఈ పరిణామంతో కేసు విచారణ వేగవంతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. 2022 మే నెలలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఏ1గా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే తొలుత ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారని, బాధితుల ఆందోళనతో హత్య కేసు నమోదు చేశారని అంటున్నారు. అంతేకాకుండా నిందితుడు స్వయంగా నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది పాత్ర ఉందన్న ఆరోపణలు పట్టించుకోకుండా కేవలం నిందితుడు ఒక్కడే హత్య చేసినట్లు కేసు నమోదు చేయడం, నిర్దేశించిన సమయంలో సాక్ష్యాలను సేకరించకపోవడం, కోర్టులో చార్జిషీటు సమర్పించకపోవడంపై పోలీసులు విమర్శలు ఎదుర్కొన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేయడంతో పోలీసులపై ఆదేశాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News