పక్కా స్కెచ్ తోనే మంత్రి పేర్ని నానిపై దాడి ... సీపీటీవీ ఫుటేజీ రిలీజ్ !

Update: 2020-12-01 09:47 GMT
వైసీపీ కీలక నేత , ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన లో తృటిలో మంత్రి పేర్ని నాని ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా ఆ హత్యయాత్నానికి సంబంధించిన వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు విడుదల చేశారు. మంత్రి నివాసం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్దయిన వీడియో ఫుటేజీ అది. పక్కా ప్రణాళికతోనే  నిందితుడు నాగేశ్వరరావు.. మంత్రి ఇంటి వద్ద కాపు కాసి, మంత్రి పై దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. స్కెచ్ ప్రకారమే మంత్రిపై హత్యాయత్నం చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడికావటంతో ఆ సమయంలో నిందితుడు వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు.

కాగా, నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తులో వేగం పెంచామని పోలీసులు తెలిపారు. నిందితుడు నాగేశ్వరరావును కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు మంత్రి పేర్ని నాని ని  తాపీతో పొడవటం, దాన్ని చూసిన వెంటనే అనుచరులు అతన్ని అడ్డుకోవడం ఆ వీడియో లో కనిపించింది. నవంబర్ 29వ తేదీన పేర్ని నాని తల్లి పెద్ద కర్మ నాడు మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దకర్మ నాడు పూజాదికాలను ముగించుకుని, భోజనాల కోసం బయలుదేరిన ఆయన గేటు వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ ఉండగా, ఒంటరిగా వచ్చిన నాగేశ్వర రావు ఆయన పై దాడి చేశాడు.

కాషాయరంగు చొక్కా ధరించిన నాగేశ్వర రావు తన జేబులో నుంచి తాపీని తీసి పేర్ని నానిని పొడవటం ఇందులో రికార్డయింది. ఈ ఘటనలో తనకేమీ కాలేదని పేర్ని నాని ఇదివరకే స్పష్టం చేశారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. పేర్ని నానిని నిందితుడు నాగేశ్వర రావు హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంటికి చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మర్డర్ మోటివ్ స్పష్టమౌతోందని తెలిపారు. ఉద్దేశపూరకంగానే ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
Tags:    

Similar News