టీడీపీలో కొత్త ట్రబుల్ షూటర్

Update: 2016-02-08 17:30 GMT
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కింజరాపు అచ్చెన్నాయుడు చాలాకీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గంలో చంద్రబాబు మెచ్చిన మంత్రుల్లో ఆయన ఒకరని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అసెంబ్లీ సమావేశాల్లో, మామూలు సమయాల్లో విపక్షాలను గట్టి కౌంటర్ ఇవ్వడం... తన శాఖపై మంచి పట్టు చూపడం... చంద్రబాబుకు విలువైన సలహాలు ఇవ్వడం వంటి కారణాలతో ఆయన ఇప్పటికే చంద్రబాబు మనసు చూరగొన్నారు. అయితే... ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఇతర మంత్రుల శాఖల్లో తలదూర్చొద్దంటూ అచ్చెన్నను చంద్రబాబు హెచ్చరించడంతో సీను రివర్సు అవుతోందని చాలామంది అనుకున్నారు. కానీ... తాజా పరిణామాలు అచ్చెన్నను మరోసారి హీరోను చేశాయి. ఒకప్పటి తన కుడిభుజం ఎర్రన్నాయుడి సోదరుడైన అచ్చెన్న ఇప్పటికే చంద్రబాబు బాగా నమ్మే నేతగా మారారు. తాజా పరిణామాలు ఆయన్ను చంద్రబాబుకు కుడిభుజం చేశాయి.. అంతేకాదు.. టీడీపీలో, రాష్ట్రంలో కొత్త ట్రబుల్ షూటర్ గా ఆయన అవతరించారనే చెప్పొచ్చు. ప్రభుత్వానికి సవాల్ గా మారిన ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షను అచ్చెన్న అత్యంత చాకచక్యంగా పరిష్కరించి గంటల వ్యవధిలోనే మొండి మనిషి ముద్రగడను కూల్ చేసి దీక్ష విరమింపజేయడం రాజకీయ ఉద్ధండులనే ఆశ్చర్యపరుస్తోంది.

ముద్రగడ చాలాకాలంగా తెరమీద లేని నేతగా అందరూ అనుకున్నా ఆయన సామాన్యుడు కాదు. మంచి మేధావి... కాపుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నవారు. అంతేకాదు.. అపారమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఎన్టీఆర్ - చెన్నారెడ్డి వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన హేమాహేమీలతో సమ ఉజ్జీగా నిలిచిన వ్యక్తి. ఆయన పట్టు పడితే అది ఉడుం పట్టే. గతంలోనూ పలుమార్లు ఆయన తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి ముద్రగడ కాపు గర్జన నిర్వహించడం... అది హింసాత్మకంగా మారడం... ఆ తరువాత ముద్రగడ ఆమరణ దీక్షకు దిగడంతో ప్రభుత్వం ఇబ్బంది పడింది. ఆయన్ను బుజ్జగించేందుకు కాపు నేతలను, అది కూడా ఆయనకు బాగా పరిచయస్థులైన తూర్పుగోదావరి నేతలనే ప్రయోగించింది. వారెవరూ ముద్రగడను ఒప్పించలేకపోయారు.. మెప్పించలేకపోరు.

తూర్పుగోదావరి జిల్లాలో క్రేజ్ ఉన్న తోట త్రిమూర్తులు - ఎమ్మెల్సీ బొ్డ్డు భాస్కరరామారావులను ముద్రగడ వద్దకు ప్రభుత్వం పలుమార్లు పంపించింది. వారితో మాట్లాడినా ముద్రగడ మెత్తబడలేదు. పార్టీల పరంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా కాపుల్లో అనుభవజ్ఙుడైన నేతగా ముద్రపడిన ముద్రగడ ముందు తోట త్రిమూర్తులు కానీ - బొడ్డు భాస్కరరామారావు కానీ గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. దాంతో వారు విఫలమయ్యారు. ఇక టీడీపీలోని కాపు మంత్రుల్లో కీలకమైన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప - నారాయణ - గంటాలు కూడా ముద్రగడకు పత్రికాముఖంగా విన్నపాలు చేశారు. అయితే.. తమ రాయబారాలకు ముద్రగడ లొంగరన్న ఉద్దేశంతో వారు ఆయన్ను నేరుగా కలవలేదు.

మరోవైపు ముద్రగడ దీక్షపై చంద్రబాబుతో సమావేశమైన కాపు మంత్రులు - కాపు నేతలు కూడా ముద్రగడ మొండి మనిషని.. ఏదో ఒక హామీ ఇస్తేనే ఆయన వింటారంటూ చంద్రబాబుపైనే ఒత్తిడి పెంచారు కానీ ముద్రగడను కలిసి ఒత్తిడిపెంచే ధైర్యం చేయలేకపోయారు. దీంతో విషయం అర్థమైన చంద్రబాబు కమిషన్ గడువు తగ్గించడం... కాపులకు రుణాలు వంటి హామీలతో చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే.. ముద్రగడతో ఎవరు చర్చించాలన్న విషయంలో స్పష్టత రాలేదు. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావులను పంపించాలని నిర్ణయించారు. అచ్చెన్న కాపు కాదు... బీసీ. కళా కాపు వర్గానికి చెందినవారు. వారిద్దరూ కలిసి ముద్రగడను కలిసి గంటన్నర పాటు చర్చించారు. నిజానికి అచ్చెన్నకు ముద్రగడతో పరిచయమూ తక్కువే. సుదీర్ఘ ప్రస్థానం ఉన్న ముద్రగడతో పోల్చితే అచ్చెన్న చాలా చిన్న. ఇద్దరూ కలిసి ఒకేసారి టీడీపీలో ఉన్నదీ లేదు. అసలు ఆ ఇద్దరూ గతంలో ఎప్పుడైనా కలిశారా... వారికి పరిచయం ఉందా అన్నదీ అనుమానమే. అయినా... కూడ మొండిమనిషి ముద్రగడను మెత్తబెట్టడానికి నేను రెడీ అంటూ అచ్చెన్న బయలుదేరారు. కళా వెంకటరావుతో కలిసి ముద్రగడను కలిసి తన మాటలతో మెప్పించారు. చంద్రబాబుకు దూతగా వచ్చామని... మేం చెబుతున్నది చంద్రబాబు మాటలేనని... మాపైనా, చంద్రబాబుపైనా నమ్మకం ఉంచాలని కోరారు. ''సరే మీ నిర్ణయం తరువాత తీసుకుందురు.. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం.. మీ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.. ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి'' అంటూ ఆయన మనసును తాకారు అచ్చెన్న. అందుకు ముద్రగడ అంగీకరించడం.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం... ఆ తరువాత దీక్ష విరమణకూ అంగీకరించడంతో అచ్చెన్న, కళాలు ఆయనకు నిమ్మరసం తాగించి విరమింపజేశారు.

మహామహుల వల్ల కాని ఆ పనిని అచ్చెన్నాయుడు ఒకే ఒక భేటీతో సఫలం చేయడం టీడీపీ నేతలనే కాకుండా రాజకీయ కురువృద్ధులనూ ఆశ్చర్యపరుస్తోంది. ముద్రగడనే ఒప్పించిన అచ్చెన్న రాజకీయ దౌత్యం మామూలుగా లేదని... ఆయన నిజంగా ట్రబుల్ షూటర్ అనడంలో తిరుగులేదని అంటున్నారు. పెద్ద సమస్యను గంటన్నరలో పరిష్కరించి అచ్చెన్నాయుడు ఇప్పుడు చంద్రబాబుకు కుడిభుజమయ్యారు.
Tags:    

Similar News