వారం త‌ర్వాత టీడీపీ నుంచి గుడ్‌ న్యూస్‌

Update: 2016-05-24 09:31 GMT
నామినెటేడ్‌ పదవుల భర్తీ...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అధికారంలో ఉన్న తెలుగుత‌మ్ముళ్లు దాదాపు రెండేళ్లుగా నిరీక్ష‌ణ‌లో ఉంచిన ప‌ద‌వుల పందేరం. ఈ ప‌ద‌వుల భ‌ర్తీ ఎపుడెపుడా అని చూస్తుంటే తాజాగా కార్మిక శాఖమంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. మహానాడు తర్వాత ప‌ద‌వుల భ‌ర్తీ ఉండొచ్చని తెలిపారు.  పార్టీ కోసం పని చేసే వారికి అవకాశం ఉంటుందని అచ్చెన్న ప్ర‌క‌టించారు.

కర్నూలులో జ‌రిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాము కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏ సమస్యనైనా తమతో చెప్పొచ్చని వెల్లడించారు. ప‌ద‌వులు ఇత‌ర‌త్రా అంశాల గురించి సమావేశాల్లో మాట్లాడితే పార్టీకి నష్టమని పేర్కొన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలకు అతీతంగా సహకరించాల్సిందిపోయి, వైకాపా నేత జగన్‌ ప్రతి పనికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ఎక్కువ పనులను వైకాపాకు చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలు దక్కించుకున్నారని విమర్శించారు. అక్కడ పనులు తీసుకొని, ఇక్కడ అన్యాయమని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ధనయజ్ఞంగా మార్చేశారని, ఆయన చేసిన అన్యాయం వల్ల హక్కులన్నీ మంటగలిసిపోయాయని వెల్లడించారు. కర్నూలులో జలదీక్ష ఎందుకు చేశారు? ఈ పరిస్థితికి కారణం ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఉన్నారు.. వైదొలగండని జగన్‌ అంటున్నారని, బయటకు వస్తే ఏమైనా మేలు జరుగుతుందో చెప్పాల‌ని వైఎస్ జ‌గ‌న్‌ ను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహాయం చేయాలని, ఇతర దేశాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని దీనికీ కేంద్రం సహాయం అవసరమని ఆయన వెల్లడించారు. భాజపా - తెదేపా నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం మానుకోవాలని, సంయమనం పాటించాలని సూచించారు. కేంద్రం నుంచి ధర్మబద్ధంగా రావాల్సిన వాటిని సాధించుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.
Tags:    

Similar News