మోడీకి భాజపా చుక్కలు చూపిస్తుందట !

Update: 2015-11-02 06:34 GMT
ఏదో రాజకీయ ప్రత్యర్థులు చుక్కలు చూపించడం అంటే ఆ సంగతి వేరు. కానీ సొంత పార్టీ, అది కూడా ప్రస్తుతం విచ్చలవిడిగా నెత్తిన పెట్టుకుంటున్న పార్టీ.. భవిష్యత్తులో తప్పక కాటేస్తుందని అంటే ఎవరైనా కంగారు పడతారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి పిండమే కానీ బీజేపీ మాత్రం బలహీనమైన పార్టీ అని దీనివల్ల ఆయనకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఒక జ్యోతిష్కుడు సెలవిచ్చాడు. జ్యోతిష్కుడు అంటే చిలక జ్యోతిష్కుడి తరహా అంగుష్టమాత్రుడు అనుకునేరు. మోదీకే జోస్యం చెప్పిన ఘనాపాఠి ఇతడు. పేరు బేజన్ దారువాలా. ప్రధాని మోదీయే తన చేయి చూపించి తన వద్ద జోస్యం చెప్పించుకున్నారని ఇతడు సెలవిచ్చాడు.

వ్యక్తిగత పనిమీద ఇండోర్ సందర్సించిన ఈ జ్యోతిష్కుడు మోదీ చేతిలో రేఖలే లేవు అని చెప్పాడు. అదే అతని బలాన్ని సూచిస్తోందని చెప్పారు. మోదీ చాలా బలవంతుడే కానీ అతడి పార్టీ బీజేపీ మాత్రం బలహీనంగా ఉందని, భవిష్యత్తు కాలంలో బీజేపీ మోదీకి సమస్యలను సృష్టించడం ఖాయమని తేల్చి చెప్పేశారు. తన కన్నా మునుపటి ప్రధానులతో పోలిస్తే మోదీ అత్యంత ప్రభావ శీలుడిగా ఉంటున్నాడని దారువాలా కితాబిచ్చారు. కానీ తాను మోదీ చేతిని చూసి ఎప్పుడు జోస్యం చెప్పిందీ మాత్రం ఇతడు బయటపెట్టలేదు.

నిజానికి మోడీ ప్రధాని అయిన తర్వాత భాజపా మీద కూడా తన గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. పార్టీలో కొమ్ములు తిరిగి నాయకులు ఎందరినో ఆయన లూప్ లైన్ లో పెట్టారు. గతంలో వాజపేయి సర్కారు లో సైతం అద్భుతమైన పరిపాలన ధురీణులుగా పేరున్న ఘనమైన నాయకులు కూడా.. పాపం ఇప్పుడు మోడీ దెబ్బకు కుదేలై.. కిమ్మనకుండా ఉంటున్నారు. వారందరిలోనూ మోడీ పట్ల అసమ్మతి ఉన్నదనే సంగతి అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉంది.  గత సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కేవలం మోడీ ఘనతే అన్నట్లుగా ఆపాదించి పార్టీ ఒక ప్రచారాన్ని చేసేసింది. మోడీ కి కిట్టని సీనియర్లు కామ్ అయిపోయారు. ఇప్పుడు మోడీ ప్రభావం అనేది వాపు తప్ప బలుపు కాదని నెమ్మది గా అంతా గుర్తిస్తున్నారు.  పార్టీ వల్ల మోడీకి ఇబ్బందులు అనే జ్యోతిష్యుడి మాట నిజం కావాలంటే... ఆ సీనియర్లు అందరూ మళ్లీ పార్టీ మీద గానీ, ఇప్పటికే ఆయనకు టర్మ్స్ డిసైడ్ చేస్తున్న ఆరెస్సెస్ మీద గానీ ఆధిపత్యం తీసుకుని.. మోడీని ఓ ఆటాడుకుంటారేమో చూడాలి.
Tags:    

Similar News