ఓవైసీకి పాతిక ల‌క్ష‌ల ఎర‌..న‌న్ను కొన‌లేరంటున్న పాత‌బ‌స్తీ నేత‌

Update: 2018-11-20 10:31 GMT
ఎంఐఎం చీఫ్ - హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ప‌ని చేయ‌కుండా ఉంటే త‌న‌కు పాతిక ల‌క్ష‌లు ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌ని అయితే...దానికి తాను అంగీక‌రించ‌లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇదంతా నిర్మ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంత‌కీ ఓవైసీకి పాతిక ల‌క్ష‌లు ఇస్తాన‌న్నది ఎవ‌రంటే...కాంగ్రెస్ నేత‌లు. ఓవైసీ మాట‌ల్లో చెప్పాలంటే నిర్మల్‌ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించకుండా ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వ‌ర్‌ రెడ్డి రూ.25 లక్షలు ఇస్తామన్నారని అయితే - తాను అంగీక‌రించ‌లేద‌ని వివ‌రించారు.

మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ జిల్లా గాజుల‌పేట్‌ లో జ‌రిగిన స‌భ‌లో ఓవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వ‌ర్‌ రెడ్డి త‌న‌కు ఎర‌వేశార‌ని వివ‌రించారు. ఒవైసీ సభను నిలిపివేస్తే రూ.25లక్షల విరాళం ఇస్తానని మజ్లిస్‌కి చెందిన కీలక వ్యక్తికి ఫోన్ చేసి ఎరవేశారని - దీనికి సంబంధించిన రికార్డింగ్‌ తన దగ్గర ఉందని అసద్‌ చెప్పారు. ఆ కాంగ్రెస్‌ అభ్యర్థి రూ.25లక్షలతో తన మద్దతుదారులను - ప్రజలను కొనగలరా? అని ప్రశ్నించారు. డబ్బుతో తనను ఎవరూ సొంతం చేసుకోలేరన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ముస్లిం పేద పిల్లల ఉన్నత చదువుల కోసం మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు విన్నవించిన వెంటనే అంగీకరించారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన ముస్లిం యువతను ఆదుకోవడానికి ఎంఐఎం పార్టీ కృషి చేసిందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్కరికీ రూ. 8 లక్షలు చొప్పున ఇప్పిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం 800 నుంచి వెయ్యి మంది విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. మౌలానా - మోజంలకు ప్రతి నెలా వేతనం - నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి రాయితీపై వాహనాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. షాదీ ముబారక్‌ పథకం కింద పేద ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతున్నాయని - ఇప్పుడు రూ.1.00,116 ఇస్తుంటే మళ్లీ తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షలు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.

రానున్న ఎన్నికలు చాలా ప్రతిష్ఠాకం.. మంచి నిర్ణయం తీసుకోండి.. మన బతుకులు బాగుచేస్తున్న వారిని గుర్తించి మద్దతు తెలపాలని ఓవైసీ కోరారు. తెదేపా అధినేత చంద్రబాబు మళ్లీ పెత్తనం చేయడానికి కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకున్నారని - ప్రజలు తిప్పికొట్టాలని ఓవైసీ కోరారు. కాంగ్రెస్‌ - భాజపాలు ముస్లిం మైనార్టీలను మోసం చేస్తున్నాయని ఓవైసీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇద్దరూ ఒకటేనని - ఒక వర్గానికే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు.



Tags:    

Similar News