ఏపీలో తెలంగాణ మద్యం దందా..చిక్కిన టీడీపీ నేత?

Update: 2020-07-06 07:00 GMT
తెలంగాణలో మద్యం చీప్.. ఏపీలో మద్యనిషేధంలో భాగంగా డబుల్ రేట్. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి ఏపీలో అమ్మితే సగం లాభం. అందుకే ఏపీ టీడీపీ నేత తెగించాడు. ఈ మద్యం దందాను వ్యాపారంగా ఎంచుకున్నాడు. లక్షలు వెనకేసుకున్నాడు. కానీ తాజాగా దొరికిపోయాడు.

తెలంగాణ నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా చేస్తూ గుంటూరులో విక్రయిస్తున్న 8మంది నిందితులను గుంటూరు ఎస్ఈబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇందులో కీలక సూత్రధారిగా టీడీపీ నేత యర్రమాసు రాముగా తేల్చారు. ఇతడే తెలంగాణ నుంచి మద్యాన్ని లారీల్లో తీసుకొచ్చి గుంటూరులో అదనపు ధరలకు విక్రయిస్తున్న విచారణలో తేలింది.

గుంటూరు-పేరేచర్ల రోడ్డులో ఆగి ఉన్న లారీని అధికారులు తనిఖీ చేయగా తాజాగా 2230 బాటిళ్ల తెలంగాణ మద్యం అధికారులకు పట్టుబడింది. లారీ డ్రైవర్ ను విచారించగా గుంటూరు లోని పట్టాభిపురంలో ఉంటున్న వైకంటి శ్రీనుకు మద్యం సరఫరా చేస్తున్నట్టు తెలిపాడు.

దీంతో శ్రీను ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయగా మరో 672 మద్యం బాటిళ్లు దొరికాయి. అతడిని విచారించగా వినుకొండ నియోజకవర్గం శావల్యపురం మండలం కారుమంచికి చెందిన టీడీపీ నేత యర్రమాసు రాము ఈ దందా చేస్తున్నాడని తెలిపారు. రాము వినుకొండ నియోజకవర్గంలో టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. దీంతో ప్రధాన నిందితుడిగా ఉన్న రాము సహా 9మందిపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్ట్ చేసి మొత్తం 11 లక్షల విలువ చేసే మద్యం, లారీ, కారు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన టీడీపీ నేత రాము పరారీలో ఉన్నాడు.
Tags:    

Similar News