మీ కొడుకు మైనరైనా బైక్ ఇస్తున్నారా ... జైల్లో ఊచలు లెక్కపెట్టడానికి సిద్దకండి !

Update: 2021-03-20 06:22 GMT
ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని  పోలీసులు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పిలియన్‌ రైడర్ ‌కు హెల్మెట్‌ తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలకు సైడ్‌ మిర్రర్‌ లు ఉండాలంటూ విధిస్తున్న ఈ–చలాన్‌ లతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకుల భరతం పడుతున్నారు. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసుల బాటలోనే వరంగల్‌ పోలీసులు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చారు. మీ కొడుకు మైనర్ అయినా కూడా వారికీ బైక్ ఇచ్చి బయటకి పంపారో అంతే సంగతులు , మీరు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే.

 వివరాల్లోకి వెళ్తే .. యువత  రోడ్డుపైకి వస్తే చాలు, వారు వాహనాన్ని నడిపే వేగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చేతిలో బైకుకు బ్రేకులు కూడా వేయడాన్ని మరిచిపోతున్నారు. మెరుపు వేగంతో క్షణాలో రోడ్డు మీద దూసుకుపోతున్నారు. ఇటీవల ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే చాలు.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని వెల్లడిస్తున్నారు. అది కూడా ఆ వాహన యజమానికి శిక్ష విధిస్తామని చెబుతున్నారు. ఈ మేరకు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే అనార్ధాలను వివరిస్తూ.. 40 సెకండ్ల నిడివిగల వీడియోను విడుదల చేశారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఇకపై మైనర్లు వాహనాలు నడుపుతూ చిక్కితే , వెంటనే ఆ వాహనాన్ని సీజ్‌ చేసి, దాని యజమానికి శిక్ష పడేలా చూస్తామని అంటున్నారు. మైనర్లకు టూవీలర్లు, ఫోర్‌ వీలర్లు ఇస్తూ ప్రోత్సహించే వారికి ఈ శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. మైనర్ల డ్రైవింగ్‌తో తల్లిదండ్రులకు కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు వాహనాలను అందజేయవద్దని పోలీసులు కోరుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో వాహనం నడపడం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతర వాహనదారులు సైతం ప్రమాదం బారిన పడే ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు. 
Tags:    

Similar News