బాలినేని సతీమణికి టికెట్ ఇస్తున్నారా...?

Update: 2023-01-23 22:07 GMT
ఆయన ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు. వైఎస్సార్ కాలం నుంచి కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న సీనియర్ నేత  బాలినేని శ్రీనివాస్ రెడ్డి .   ఆ కుటుంబానికి బంధువు ఆత్మబంధువు కూడా. అలాంటి బాలిరెడ్డి వైఎస్సార్ మరణానంతరం జగన్ మీద అభిమానంతో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించి వైసీపీలో చేరారు. ఆనాటికి జగన్ సీఎం అవుతారని కానీ తాను మంత్రి అవుతాను అని కానీ ఊహించలేదు. వైఎస్సార్ ఫ్యామిలీ మీద ప్రేమ ఆయన్ని అలా నడిపించింది.

ఇలా పదేళ్ల పాటు పార్టీని మోసిన ఆయనకు 2019లో మంత్రి పదవి దక్కింది. అయితే మూడేళ్ళ తరువాత ఆ మంత్రి పదవి పోయింది. అయితే ఆయన పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి బాలినేని తనకు టికెట్ రాదేమో అన్న సందేహాన్ని తాజాగా వ్యక్తం చేశారు. వైసీపీలో మహిళా ప్రాధాన్యత  ఇస్తున్న క్రమంలో తనకు బదులుగా తన సతీమణికి టికెట్ ఇస్తారని ఆయన చెప్పడం విశేషం.

తనకు బదులుగా తన సతీమణి రాజకీయాల్లోకి రావచ్చు అని ఇండైరెక్ట్ గా బాలినేని పేర్కొన్నారా అన్న చర్చ వస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే  తన సతీమణికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా  మరోసారి పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీగా అయినా తీసుకుని బాలినేనికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఏమైనా జగన్ ఇచ్చారా అని కూడా అనుకుంటున్నారు.

మరో వైపు చూస్తే ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జి అశోక్ బాబు పట్ల  వ్యతిరేకత ఉందని బాలినేని అనడం విశేషం. పార్టీలో అసంతృప్తి ఉందని అందరూ విభేదాలు మరచి పనిచేయాలని బాలినేని సూచించారు. మొత్తానికి బాలినేని కీలక వ్యాఖ్యలు ఇపుడు పార్టీలో చర్చనీయాశం అవుతున్నాయి.  మాజీ మంత్రి బాలినేని సతీమణి రాజకీయ అరంగేట్రం వచ్చే ఎన్నికల్లో ఉంటుందా అన్నదే ఇపుడు ఆసక్తిని కలిగించే అంశమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News