మళ్ళీ కాంగ్రెస్, టీడీపీ కలుస్తున్నాయా ?

Update: 2021-04-18 11:30 GMT
అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కాకపోతే ఈ రెండు పార్టీలు కలిసేది తెలంగాణా స్ధానికసంస్ధల ఎన్నికల్లో. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటిలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. మిగిలిన వాటి సంగతిని పక్కన పెట్టేసినా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ తో కలిసి టీడీపీ కలిసి పోటీచేయాలని డిసైడ్ అయ్యాయి. కాకపోత ఈ రెండుపార్టీలకు మధ్యలో సీపీఎం కూడా ఉందిలేండి.

తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్+టీడీపీలు పొత్తుపెట్టుకుని పోటీచేశాయి. విడిగా పోటీచేసుంటే ఏమయ్యేది తెలీదు కానీ రెండు కలిసి పోటీచేయటం వల్ల తాము పెద్ద ఎత్తున నష్టపోయినట్లు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తమ ఓటమికి టీడీపీతో పొత్తుపెట్టుకోవటమే ప్రధాన కారణమని కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. అప్పటి నుండి రెండుపార్టీలు మళ్ళీ ఎక్కడా కలిసిందిలేదు.

అలాంటిది ఇపుడు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యింది.  సీట్లసర్దుబాటు విషయమై ఇప్పటికే మూడు పార్టీల నేతలు రెండుమూడుసార్లు భేటీ కూడా అయ్యారు. కార్పొరేషన్లో 60 డివిజన్లున్నాయి. కాంగ్రెస్ 25-30 డివిజన్లలో పోటీ చేయాలని పట్టుదలతో ఉంది. సీపీఎం 25 సీట్లు కావాల్సిందే అని పట్టుబడుతోంది. రెండుపార్టీలకు పోను మిగిలిన సీట్లలో టీడీపీ పోటీచేయబోతోంది.

ఇదే సమయంలో టీఆర్ఎస్+సీపీఐ కలిసి పోటీచేయబోతున్నాయి. ఎప్పటిలాగే జనసేన మద్దతుతో బీజేపీ పోటీచేయబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవటానికి చంద్రబాబునాయుడు అనుమతివ్వటం. నిజానికి తెలంగాణాలో టీడీపీ పరిస్ధితి అవసానదశకు వచ్చేసింది. మొన్నటి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తే ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. చాలా డివిజన్లలో అసలు డిపాజిట్లే దక్కలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తులో నాలుగు సీట్లు గెలిస్తే మంచిదేకదా.
Tags:    

Similar News