రాజధానిలో అంతర్జాతీయ స్థాయి బస్‌ స్టేషన్‌!

Update: 2015-07-06 17:30 GMT
ఏపీఎస్‌ఆర్టీసీ రెండుగా విడిపోయింది. తెలంగాణకు బస్‌ స్టేషన్‌తోపాటు ఇతర మౌలిక సదుపాయాలూ ఉన్నాయి. కానీ నవ్యాంధ్ర అన్నిటినీ ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగానే నవ్యాంధ్రకు ప్రధానమైన బస్‌ స్టేషన్‌ అంతర్జాతీయస్థాయిలో అల్ట్రా మోడర్న్‌గా నిర్మించాలని భావిస్తున్నారు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు. ఇప్పటి నుంచే ఆయన ఇందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో ఆర్టీసీ ప్రధాన బస్‌ స్టేషన్‌తోపాటు ఇతర భవనాలు నిర్మించడానికి స్థలాలు కావాలని ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాజధానిలో ఆర్టీసీ సైతం అంతర్జాతీయ స్థాయిలో పరిపాలన, ఆపరేషనల్‌ భవనాలను నిర్మించాలని భావిస్తోందని, తమకు కూడా రైతుల నుంచి భూమిని సమీకరించిన భూముల్లోనే స్థలాలు కేటాయించాలని ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ బిల్డింగ్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి ఆయన లేఖ రాశారు.

బస్‌ డిపో నిర్మాణం కూడా తుళ్లూరులోనే చేపడతామని స్పష్టం చేశారు. అలాగే, తుళ్లూరులో అంతర్జాతీయ స్థాయిలో బస్‌ స్టేషన్‌ను నిర్మిస్తామన్నారు.బస్‌ భవన్‌తోపాటు ఆర్టీసికి అత్యవసరమైన  వర్క్‌షాప్‌ను కూడా తుళ్లూరులోనే ఏర్పాటు చేయదలిచామని, ఈ మూడింటికీ కలిపి 25 ఎకరాల స్థలం అవసరమవుతుందని తన లేఖలో ఆయన వివరించారు. అమరావతి పర్యాటకంగా అభివృద్ధి చెందనుందని, కాలనీలు విస్తరించి జనావాసాలు పెరగనున్నాయని, యాత్రికుల రద్దీ పెరగనుందని ఈ నేపథ్యంలోనే ఇక్కడ మెగా బస్‌ డిపో నిర్మాణాన్ని చేపట్టదలిచామని వివరించారు.

Tags:    

Similar News