ఈ ఏపీ మంత్రి రూటే సపరేటు.. పీహెచ్‌డీ పూర్తి!

Update: 2023-06-10 12:52 GMT
ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, ఎంత వయసు వచ్చినా చదువుకోవడానికి, విజ్ఞానం పొందడానికి ఇవేమీ అడ్డంకి కావు. ఇప్పటికే తమ పిల్లలతోపాటు పరీక్షలు రాసి పాసవుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే చదువుపైన తృష్ణతో లేటు వయసులోనూ ఉన్నత చదువులు చదివి రాణిస్తున్నవారూ ఉన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం పీజీలు, పీహెచ్‌డీలు చేస్తున్నారు.

తాజాగా ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తద్వారా పలువురికి ఆదర్శంగా నిలిచారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నుంచి ఆయన పీహెచ్‌డీ పూర్తి చేశారు. "పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలు" అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు.

మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి యూనివర్సిటీ అధ్యాపకుల సమక్షంలో పీహెచ్‌డీ వైవా ప్రజంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థి వలే ఆయన సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేసినట్టు యూనివర్శిటీ వీసీ సుందరవల్లి పీహెచ్‌డీ పట్టాను మంత్రికి అందజేశారు.

దీంతో డాక్టర్‌ కాకాణి గోవర్ధన రెడ్డిగా ఆయన మారారు. ఈ సందర్భంగా తాను పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు సహకరించిన అధ్యాపకులకు మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా గతంలో కాకాణి గోవర్థన్‌ రెడ్డి జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌ గా ఉన్నారు. రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బీటెక్, ఎంబీఏ, ఎంఏ సోషియాలజీ చదివారు. 2014, 2019 ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి వైసీపీ తరఫున కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ గెలిచాక శాసనసభ ప్రొటోకాల్‌ కమిటీ చైర్మన్‌గా కాకాణి వ్యవహరించారు. వైఎస్‌ జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కాకాణి కీలకమైన వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఓవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు మంత్రిగా తీరిక సలపని బిజీ షెడ్యూల్‌ తో ఉన్నా చదువుపై మక్కువతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. దీంతో ఆయన సహచరులు, స్నేహితులు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Similar News