జగన్ జైలు ఎపిసోడ్ లోకి దేవుడ్ని ఎందుకు లాగుతావు సామీ

Update: 2021-12-30 14:30 GMT
గొప్పలు చెప్పుకోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా.. వాటిని వదిలేసి.. దేవుడ్ని ముగ్గులోకి లాగాల్సిన అవసరం ఉందా? ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే వల్లమాలిన అభిమానం.. అర్థం చేసుకోవచ్చు. తన లాంటి నేతను ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చేసిన రుణాన్ని అవసరమైన ప్రతి సందర్భంలోనూ మాటల్లో తీర్చుకునే ప్రయత్నాన్ని అర్థం చేసుకోవచ్చు. జగన్ ఏ తప్పు చేయలేదనటం తప్పేం కాదు. కానీ.. ఈ విషయాల్లో వేటికి సంబంధం లేని దేవుడ్ని సీన్లోకి లాగాల్సిన అవసరం ఏమిటన్నదే అసలుసిసలు అభ్యంతరమంతా.

అది కూడా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని.. పొద్దుపొద్దున్నే దేవుడికి సవాలు విసరటానికి మించిన తప్పు ఇంకేం ఉంటుందా? దేవుడ్ని నమ్మని కమ్యునిస్టుల నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే అర్థం చేసుకోవచ్చు. దేవుడ్ని నూటికి నూరుపాళ్లు నమ్మే నారాయణ స్వామి లాంటి వీర భక్తులు.. చూస్తూ.. చూస్తూ.. దేవుడ్ని లింకు చేసుకొని మాట్లాడటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్న.

తనకు దైవ సమానులైన జగన్ మీద తనకున్న అచంచలమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శించేందుకు ఎన్ని అతిశయపు మాటలైనా చెప్పొచ్చు. తప్పు లేదు.కానీ.. బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడన్న పైత్యపు మాటలు అవసరమా? అన్నది ప్రశ్న. జగన్ మీద బురద జల్లుతున్నారన్న ఆయన ఆరోపణలు నిజమైతే.. కోర్టులు ఆయన్ను సుద్దపూసగా తేలుస్తాయి.

అంత మాత్రానికే అలా చెలరేగిపోతే ఎలా? బీజేపీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుతామని అన్నంత మాత్రాన అంతలా చెలరేగిపోవాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. జగన్ సింహమని.. ఆయన ఎవరికీ భయపడరన్నంత వరకు బాగానే ఉంది. కానీ.. దేవుడి ఇగో హర్ట్ అయ్యేలా బ్రహ్మదేవుడ్ని ముగ్గులోకి లాగేసి.. ఆయన కూడా జగన్ ను జైలుకు పంపించలేడని వ్యాఖ్యానించిన వైఖరి ఏ మాత్రం సబబుగా లేదన్న మాట వినిపిస్తోంది.

ఇక.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. చీప్ లిక్కర్ తక్కువ ధరకు ఇస్తామని చెప్పిన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. మద్యం ఇస్తామని చెప్పి ఎవరైనా ఓట్లు అడుగుతారా? అని ప్రశ్నించారు. నిజమే.. మద్యం పేరుతో ఓట్లు అడగటం తప్పు. కానీ.. ఏం చేస్తాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్ తన పాలనతో ప్రజలకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఇలాంటివేళ.. జగన్ ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేయలేదో ఆ అంశాన్ని ప్రస్తావించి.. ఓట్లను దండుకోవాలి కదా? అందుకే.. ఏపీలో ఆకాశాన్ని అంటేలా ఉండే చీప్ లిక్కర్ ధరల్ని భారీగా తగ్గిస్తామన్న ఆశ చూపటం ద్వారా అయినా మైలేజీ సొంతం చేసుకోవాలని తపిస్తున్న సోమును వదిలేయొచ్చు కదా నారాయణస్వామీ?




Tags:    

Similar News