ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ప్రమాణం.. రేవంత్ సర్కార్‌కు పెరిగిన బలం!
తెలంగాణ రాజకీయాల్లో కొన్నాళ్లుగా సాగుతున్న ఎమ్మెల్సీల నియామక ఉత్కంఠకు ఈ ప్రమాణ స్వీకారంతో తెరపడింది.;
తెలంగాణ రాజకీయాల్లో కొన్నాళ్లుగా సాగుతున్న ఎమ్మెల్సీల నియామక ఉత్కంఠకు ఈ ప్రమాణ స్వీకారంతో తెరపడింది. ఒకవైపు తెలంగాణ ఉద్యమ గొంతుక ప్రొఫెసర్ కోదండరాం, మరోవైపు క్రీడారంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ అజహరుద్దీన్ చట్టసభలో అడుగుపెట్టడం విశేషం.
తెలంగాణ శాసనమండలిలో బుధవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌తో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వారికి అభినందనలు తెలపడం ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను చాటిచెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన 24 గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తవడం.. ముఖ్యంగా అజహరుద్దీన్ కు ఉన్న రాజ్యాంగపరమైన గడువు దృష్ట్యా ఇది వేగంగా జరిగిన పరిణామం.
కోదండరాం ప్రస్థానం
ప్రొఫెసర్ కోదండరాంను మండలికి పంపడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు పెద్దపీట వేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా అన్ని వర్గాలను ఏకం చేసిన కోదండరాం అనుభవం ఇప్పుడు సభకు ఉపయోగపడనుంది. ఒక మేధావిగా, ప్రొఫెసర్‌గా ఆయన చేసే సూచనలు రాష్ట్ర అభివృద్ధికి, విద్యా వ్యవస్థలో మార్పులకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ విశ్లేషకులు దీనిని ‘ఉద్యమ శక్తులకు దక్కిన గౌరవం’గా అభివర్ణిస్తున్నారు.
రాజ్యాంగ గండం నుంచి గట్టెక్కిన అజహరుద్దీన్
మహమ్మద్ అజహరుద్దీన్ విషయంలో ఈ ప్రమాణ స్వీకారం ఊరట. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్. ఆరు నెలల గడువు ముగియడానికి ముందే సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉంది. గవర్నర్ ఆమోదం ఆలస్యం కావడంతో ఒక దశలో ఆయన మంత్రి పదవికి గండం వాటిల్లుతుందేమో అన్న ప్రచారం జరిగింది. తాజా ప్రమాణ స్వీకారంతో ఆ గండం తొలగిపోయింది. క్రీడారంగం నుంచి వచ్చిన అజహరుద్దీన్, మైనారిటీ సంక్షేమం, క్రీడా అభివృద్ధిపై మండలిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
మండలిలో సమీకరణాలు..
గవర్నర్ కోటాలో ఈ ఇద్దరు సభ్యుల చేరికతో శాసనమండలిలో అధికార పక్షం బలం పెరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులపై చర్చలు జరిగినప్పుడు కోదండరాం వంటి మేధావుల వాదన ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది. తమకు మద్దతుగా నిలిచిన మిత్రపక్షాలను, క్రీడా దిగ్గజాలను గౌరవించుకోవడంలో రేవంత్ సర్కార్ సఫలమైందన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
తెలంగాణ శాసనమండలిని ‘పెద్దల సభ’ అని పిలుస్తారు. అటువంటి సభలో అనుభవం, జ్ఞానం, ప్రజాధారణ కలిగిన నేతలు అడుగుపెట్టడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. కోదండరాం ప్రజా సమస్యలపై తన గళాన్ని ఎలా వినిపిస్తారు, అజహరుద్దీన్ మంత్రిగా, ఎమ్మెల్సీగా తన రెండో ఇన్నింగ్స్‌ను ఎలా కొనసాగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడంలో, ప్రజలకు మేలు చేసే చట్టాలను రూపొందించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించాలని సమాజం కోరుకుంటోంది.