భారతీయ వివాహాల్లో ‘సిచ్యుయేషన్‌షిప్’ ట్రెండ్.. నిశ్శబ్దంగా పెరుగుతున్న భావోద్వేగ దూరం

భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది రెండు కుటుంబాల కలయిక, విలువల సమ్మేళనం, బాధ్యతలతో ముడిపడిన ఒక పవిత్ర బంధం.;

Update: 2026-04-27 10:36 GMT

భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది రెండు కుటుంబాల కలయిక, విలువల సమ్మేళనం, బాధ్యతలతో ముడిపడిన ఒక పవిత్ర బంధం. తరతరాలుగా వస్తున్న ఈ వ్యవస్థలో ఇప్పుడు ఒక ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆధునిక జీవనశైలి, ఆర్థిక స్వతంత్రత, వ్యక్తిగత స్వేచ్ఛకు పెరిగిన ప్రాధాన్యత కారణంగా “సిచ్యుయేషన్‌షిప్ ఇన్ మ్యారేజ్” అనే కొత్త ధోరణి భారతీయ గృహాల్లో నిశ్శబ్దంగా వేళ్లూనుకుంటోంది.

ఏమిటీ ‘సిచ్యుయేషన్‌షిప్’?

సాధారణంగా ‘సిచ్యుయేషన్‌షిప్’ అనే పదాన్ని డేటింగ్ ప్రపంచంలో స్పష్టమైన కమిట్మెంట్ లేని సంబంధాలకు వాడుతుంటారు. కానీ ఇప్పుడు ఇది పెళ్లయిన జంటల మధ్య కూడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చట్టపరంగా భార్యాభర్తలుగా కొనసాగుతూ ఒకే కప్పు కింద నివసిస్తున్నప్పటికీ.. వారి మధ్య భావోద్వేగ అనుబంధం, పరస్పర అవగాహన లోపించడమే దీని ప్రధాన లక్షణం. బయటకు చూడటానికి ఇది ఒక పరిపూర్ణమైన కుటుంబంలా కనిపిస్తుంది.. కానీ లోపల మాత్రం ఎడారిని తలపించే నిశ్శబ్దం రాజ్యమేలుతుంటుంది.

మారిన ప్రాధాన్యతలు.. పెరిగిన ఎడబాటు

ఒకప్పుడు వివాహ బంధంలో సమస్యలు వస్తే కూర్చుని మాట్లాడుకునేవారు లేదా పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేవారు. కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అధిక పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్స్ వల్ల భాగస్వామితో గడిపే నాణ్యమైన సమయం తగ్గిపోయింది.

రవి అనే ఐటీ కంపెనీ యజమాని మాటల్లో చెప్పాలంటే.. "మా పెళ్లయి ఆరేళ్లు. కానీ మా సంభాషణలు కేవలం ఇంటి అవసరాలు, బిల్లులు, పిల్లల ఫీజులకే పరిమితమయ్యాయి. ఒకరి వ్యక్తిగత జీవితంలో మరొకరం జోక్యం చేసుకోం. ఇది గొడవలు లేని ప్రశాంతతే కావొచ్చు.. కానీ ఇందులో ప్రేమానురాగాలు లేవు."

భావోద్వేగ శూన్యం..

అంజలి అనే గృహిణి ఆవేదన మరోలా ఉంది. "మా మధ్య పెద్ద గొడవలేవీ లేవు. కానీ ఒకరికొకరం అపరిచితుల్లా మారిపోతున్నాం. ఇంట్లో ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. కేవలం సామాజిక గౌరవం కోసం, పిల్లల కోసం ఈ ముసుగు బంధాన్ని లాగుతున్నాం." ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వీరు విడిపోవడానికి సిద్ధంగా లేరు.. అలాగని కలిసి మనస్పూర్తిగా జీవించలేకపోతున్నారు. దీనినే నిపుణులు "డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్" అని పిలుస్తున్నారు.

ఈ ధోరణికి గల కారణాలు...

మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వల్ల చిన్నపాటి అసహనాలు కాలక్రమేణా పెద్ద అగాధాలుగా మారుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తుండటంతో ఒకరిపై ఒకరికి ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. ఇది అహంభావాలకు దారితీస్తోంది. వర్చువల్ ప్రపంచంలో గడిపే సమయం ఎక్కువై పక్కనే ఉన్న మనిషితో కనెక్ట్ అవ్వడం తగ్గిపోతోంది. విడాకులు తీసుకోవడం ఇప్పటికీ సామాజికంగా పెద్ద అవమానంగా భావించడం వల్ల, ఇష్టం లేకున్నా ఒకే ఇంట్లో వేర్వేరు వ్యక్తుల్లా బతుకుతున్నారు.

పరిష్కారం ఎక్కడ?

మరో యువ ప్రొఫెషనల్ కిరణ్ అభిప్రాయం ప్రకారం.. "మేము పిల్లల భవిష్యత్తు కోసం ఒక కాంట్రాక్ట్ లాగా కలిసి ఉంటున్నాం. వాళ్లు పెద్దయ్యాక ఎవరి దారి వారు చూసుకోవాలనుకుంటున్నాం." ఇలాంటి ఆలోచనలు సమాజంలో బాధ్యతాయుతమైన వివాహ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధానికైనా 'సంభాషణ' ప్రాణం వంటిది. సమస్యలను దాచిపెట్టడం కంటే.. వాటి గురించి చర్చించడం ద్వారానే పరిష్కారం దొరుకుతుంది. కేవలం భౌతిక అవసరాల కోసం కాకుండా భావోద్వేగాల కోసం ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి.

మొత్తానికి భారతీయ వివాహ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న ఈ ‘సిచ్యుయేషన్‌షిప్’ ట్రెండ్ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. బంధం అంటే కేవలం బాధ్యతల మోత మాత్రమే కాదు, అది రెండు ఆత్మల అనుబంధం అని గుర్తించినప్పుడే ఈ దూరం తగ్గుతుంది.

Tags:    

Similar News