ఆమె కోసం కేంద్రానికి మరోసారి లేఖ రాసిన జగన్

Update: 2020-07-29 05:00 GMT
ఇవాల్టి రోజున సమర్థులైన అధికారులు దొరకటం అంత తేలికైన విషయం కాదు. సమర్థతకు సామర్థ్యం తోడు కావటం.. అందుకు నిజాయితీ కలిసి ఉంటే.. అంతకు మించిన విషయం ఏముంటుంది? ఇలాంటి సుగుణాల పుట్టగా ఏపీ సీఎస్ నీలం సాహ్నిగా చెప్పక తప్పదు. ఏపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టేవారు.. అదే పనిగా విమర్శలు గుప్పించే వారు సైతం.. నీలంసాహ్నిని ఒక మాట అనేందుకు మాత్రం ముందు వెనుకా ఆడతారు. అలాంటి వ్యక్తిత్వం ఆమె సొంతం.

అలాంటి ఆమె రిటైర్ అయ్యాక.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్రానికి లేఖ రాయటం.. ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కోరారు. కనీసం ఆర్నెల్లు అయిన ఆమె పదవీ కాలం పొడిగించాలని కోరితే.. కేంద్రం మాత్రం మూడు నెలలకు మాత్రమే ఓకే చెప్పింది. ఇప్పుడు ఆ మూడు నెలలు ముగిసిపోనున్నాయి. దీంతో.. సీఎం జగన్ మరోసారి ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రానికిలేఖ రాయటం గమనార్హం.

గతంలో కేంద్రం అనుమతించిన దాని ప్రకారం నీలం సాహ్ని పదవీ కాలం సెప్టెంబరులో ముగియనుంది. అయితే.. అప్పటికప్పుడు ప్రయత్నాలు చేయటం కష్టం కావటంతో.. ముందస్తుగానే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. 1984 బ్యాచ్ కు చెందిన ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కేంద్ర సర్వీసుల్లో ఉన్నఆమెను ఏపీ సీఎస్ గా ఎంపిక చేస్తూ బాధ్యతలు అప్పజెప్పారు.

దీంతో.. ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయి.. ఏపీకి వచ్చారు. అప్పటికే ఏపీ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు. అనంతరం పూర్తిస్థాయిలో నీలం సాహ్నికి బాధ్యలు అప్పజెప్పారు. ఆ మధ్య కేంద్రం అనుమతిచ్చిన పదవీ కాలం ముగిసేందుకు టైం దగ్గర పడటంతో.. తాజాగా ఆమె పదవీ కాలం పొడిగింపుపై తమ రిక్వెస్టును ఆమోదించాలని కోరుతూ స్వయంగా సీఎం జగనే రంగంలోకి దిగారు. మరి.. కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News