ఏపీ సీఎం కాన్వాయ్ కు ఈ పరిస్థితా? మూడేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు?

Update: 2022-05-12 14:30 GMT
షాకింగ్ నిజం బయటకు వచ్చింది. తరచూ ఏదో ఒక కొత్త పథకంతో వార్తల్లో ఉంటూ.. సంక్షేమ ప్రభుత్వానికి కేరాఫ్ అడ్రస్ గా తమను తాము గొప్పగా చెప్పుకునే జగన్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలాంటి షాక్ ఒకటి తగిలింది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి రవాణా శాఖ ఒక లేఖ రాసింది. గడిచిన మూడేళ్లుగా భారీగా పాత బకాయిలు పేరుకుపోయినట్లుగా పేర్కొన్నారు. తమకు రావాల్సిన రూ.17.5 కోట్ల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరింది.

ఒకవేళ తమకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించని పక్షంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర ముఖ్యనేతల జిల్లాల పర్యటనలకు తాము వాహనాల్ని సమకూర్చలేమని రవాణా శాఖాధికారులు తాజాగా రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఇటీవల రవాణా శాఖ నిర్వహించిన రివ్యూ సందర్భంగా ఈ విషయాన్ని శాఖా మంత్రికి రవాణా శాఖాధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్యన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఒంగోలు రవాణా శాఖా అధికారులు తిరుపతికి వెళుతున్న యాత్రికుల కారును బలవంతంగా తీసుకోవటం.. అది కాస్తా పెద్ద వివాదంగా మారటం.. ఏపీ సర్కారు ఇమేజ్ దారుణంగా దెబ్బ తినటం తెలిసిందే. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన త్వరలో షురూ కానున్న వేళ.. పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని వెంటనే చెల్లిస్తేనే తాము వాహనాల్ని సమకూర్చగలుగుతామని పేర్కొన్నారు.

వీఐపీ వాహనాల కోసం కనీసం రూ.4.5 కోట్ల మొత్తం అవసరమని.. దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. ఇంతకాలం రవాణా శాఖ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటన్న ప్రశ్నకు.. తాజా లేఖతో అన్ని సందేహాలు తీరినట్లుగా చెప్పక తప్పదు. ఇప్పటికైనా వారికి చెల్లించాల్సిన బకాయిలు ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదంటే.. ఇంకేమైనా చెబుతుందా? అన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News