చ‌ప్ప‌ట్లు.. సీఎం కొట్టారు.. ఎమ్మెల్యేలు ఎందుకు కొట్టలేదో తెలుసా!?

Update: 2020-10-05 11:30 GMT
పైకి ప్ర‌చారం చేసుకోక‌పోయినా.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంచి క్ర‌మ శిక్ష‌ణ ఉంద‌నేది వాస్త‌వం. అంత‌ర్గత ప్రజా స్వామ్యంతోపాటు క్ర‌మ‌శిక్ష‌ణకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. ఎమ్మెల్యేలు - ఎంపీలు - నేత‌లు - నాయ‌కులు - ఆఖ‌రుకు కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ అంటే.. ప్రాణం. ఆయ‌న సీఎం కావాల‌ని క‌ల‌లు క‌న్న‌వారే ఎక్కువ‌గా ఉన్నారు. ఇక‌, త‌మ‌కు ప‌ద‌వులు ఇస్తాన‌ని చెప్పి.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు త్యాగాలు చేయాల‌ని ఆదేశించి.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర అయినా.. ప‌ట్టించుకోని నాయ‌కులు ఉన్నారు. అయినా ఎవ‌రూ ఒక్క‌రు కూడా రోడ్డున ప‌డ‌రు. ద‌టీజ్ డిసిప్లీన్ ఆఫ్ వైసీపీ!!

అయితే, ఇప్పుడు ఇంత ప‌టిష్ట‌మైన క్ర‌మ‌శిక్ష‌ణకు ఎక్క‌డో బీట‌లు ప‌డుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏకంగా సీఎం జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు - చేసిన ఆదేశాన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోలేద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇక‌, దీనిపై సీఎం జ‌గ‌న్‌ కు ఇంటిలిజెన్స్ నివేదిక కూడా అందింద‌నే ప్ర‌చారం జోరందుకుంది. మ‌రి ఇంత‌కీ ఏ విష‌యంలో ఎమ్మెల్యేలు సీఎం జ‌గ‌న్ మాట విన‌లేదు?  అస‌లు ఎందుక‌లా చేయాల్సి వ‌చ్చింది?  ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ ఎందుకు అంత సీరియ‌స్‌ గా తీసుకున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

విష‌యంలోకి వెళ్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇది సంచ‌ల‌న ప‌థ‌కం లేదా ఇది ప్ర‌తిష్టాత్మక కార్య‌క్ర‌మం అని చెప్పాల్సి వ‌స్తే.. అది గ్రామ‌ - వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌. ఈ విష‌యాన్ని ప్రభుత్వంతోపాటు ప‌లు రాష్ట్రాలు.. జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా కూడా ప‌రోక్షంగా దీనిని అంగీక‌రించింది. అధికారంలోకి వ‌స్తూనే జ‌గ‌న్ ఈ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌భుత్వానికి-ప్ర‌జ‌లకు మ‌ధ్య సార‌ధులు - వార‌ధులుగా వ‌లంటీర్ల‌ను నియ‌మించారు. దాదాపు 4 ల‌క్ష‌ల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని - ప్ర‌భుత్వ ప‌థ‌కాలు - సంక్షేమ కార్య‌క్ర‌మాల ల‌బ్ధి.. ఇత‌రత్రా ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు చేరే ప‌నులు అన్నింటినీ వీరి ద్వారా చేయిస్తున్నారు.

ఇది ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు సాధించింది. అయితే, ఈ ప‌రిణామ‌మే.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు కంట‌గింపుగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ``మా నియోజ‌క‌వ‌ర్గంలో మమ్మ‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏ అవ‌స‌రం ఉన్నా.. వ‌లంటీరే! మేం ఎందుకున్నామో.. మాకే అర్ధం కావ‌డం లేదు`` కొన్నాళ్ల కింద‌ట.. ఓ ఎమ్మెల్యే న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు ఇవి. అంటే.. జ‌గ‌న్ సమున్న‌త ల‌క్ష్యంతో తీసుకువ‌చ్చిన వ‌లంటీర్‌ - స‌చివాల‌య వ్య‌వ‌స్థ కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు - ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య రిలేష‌న్ ప‌ల‌చ‌నైంద‌నే విష‌యం అర్ధ‌మ‌వుతోంది.

దీంతోనే ఎమ్మెల్యేలు సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన ఈ కార్య‌క్ర‌మంపై గుస్సాగా ఉన్నార‌ని తెలుస్తోంది. మొన్న అక్టోబ‌రు 2వ తేదీ నాటికి ఈ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలో గ్రామ‌ - వార్డు వ‌లంటీర్ల‌ను ప్రోత్స‌హించేందుకు జ‌గ‌న్ వినూత్న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో చ‌ప్ప‌ట్లు కొట్టి వ‌లంటీర్ల‌ను అభినందించాల‌ని పిలుపునిచ్చారు. స్వ‌యంగా త‌ను కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించారు. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిన ఎమ్మెల్యేలు చాలా త‌క్కువ మంది హాజ‌ర‌య్యారు. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వారు ఈ కార్య‌క్ర‌మం చేయాల్సి ఉన్నా.. పెద్ద‌గా స్పందించ‌లేదు. దీనిపై రిపోర్టు తెప్పించుకున్న జ‌గ‌న్‌.. వారితో వ్య‌క్తిగ‌తంగా క‌లిసిన‌ప్పుడు.. దీనిపై క్లాస్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు . మొత్తానికి వైసీపీలో ఏదో తేడా కొడుతోంద‌నే వ్యాఖ్య‌లు మాత్రం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News