30 నిమిషాల్లో పేషెంట్‌ అడ్మిషన్‌ జరిగిపోవాలి : సీఎం జగన్ !

Update: 2020-07-28 11:50 GMT
ఏపీ సీఎం జగన్ .. తాజాగా కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌ గా పనిచేస్తున్నారని, కరోనా‌ లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేసులు తక్కువ చేసి చూపలేదని , దేశంలోనే రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని సీఎం తెలిపారు. ప్రతి మిలియన్‌ మందికి 31వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తాజాగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ కేసులు వస్తున్నప్పుడు కాస్త భయపడతారు. కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి పరీక్షలు తగ్గించి.. రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. కానీ, రాష్ట్రంలో ఎప్పుడూ అలా జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు ననమోదు అయ్యాయని, అందులో సగం మంది చిక్సిత తీసుకోని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారని తెలిపారు. ఏపీలో పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోయినా.. మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేశాం అని తెలిపారు.

కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ వేచి చూడాలి. మధ్యప్రదేశ్‌ సీఎంకూడా కరోనా వచ్చింది. కరోనా రావడమన్నది పాపం కాదు.. నేరం కాదు అని తెలిపారు. అలాగే , చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ ఉండదని ,కానీ భయంతో బంధువులకు కూడా మనం అంత్యక్రియలు చేయకపోవడం బాధాకరం అని , ఒకవేళ అంత్యక్రియల చేయడానికి బంధువులు రాకపోతే ప్రభుత్వమే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తుంది అని వివరించారు. అలాగే ఎవరికైనా కరోనా వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? ఎవరికి కాల్‌ చేయాలన్నదానిపై.. వివరాలు అందరికీ తెలియజేయాలని అన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా గురించి పోస్టర్లు ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఇచ్చాం అని , జిల్లాలో కరోనా కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్‌ ప్రకటనలు ఇచ్చాం అని , ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్‌ చేసినప్పుడు.. సమర్థవంతంగా పనిచేసేలా చేయాలి. అధికారులు.. కాల్‌ చేసి కాల్‌ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే , వైరస్ ‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత, హోం క్వారంటైన్, కరోనా‌ కేర్‌ సెంటర్‌, జిల్లా కరోనా ఆస్పత్రి.. రాష్ట్రస్థాయి కరోనా‌ ఆస్పత్రులకు ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పంపిస్తాం అని తెలిపారు. అలాగే హోమ్ ఐసోలేషన్ లో డాక్టర్ ప్రతి రోజు ఆ బాధితుడి ఆరోగ్యం గురించి కాల్ చేసి కనుక్కోవాలని , తగిన మందులు అందించాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 128 జిల్లా ఆస్పత్రులను మనం గుర్తించామని , 32 వేల బెడ్లు ఇందులో అందుబాటులో ఉన్నాయని , 30 నిమిషాల్లో పేషెంట్‌ అడ్మిషన్‌ జరిగిపోవాలని , ఏ ఒక్కరి నోటి నుండి కూడా బెడ్ దొరకలేదు అనే మాట వినిపించకూడదు అని సీఎం తెలిపారు. రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో 8 వేల బెడ్లు ఉన్నాయి. వీటిని క్రిటికల్‌ కేర్‌ కోసం వాడాలి. పేషెంట్ ఆరోగ్యాన్ని బట్టి అర గంటలోగా బెడ్‌ కేటాయించాలని ,కరోనా‌ కేర్‌ సెంటర్ల వద్ద, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులవద్ద.. రాష్ట్రస్థాయి కరోనా ‌ఆస్పత్రుల వద్ద ఫిర్యాదు చేయడానికి.. 1902 నంబర్ ‌డిస్‌ప్లే చేయాలని తెలిపారు. ప్రజల వెంట ప్రభుత్వం ఉందనే నమ్మకం ప్రజల్లో కలిగేలా చేయాలనీ అధికారులకి సూచించారు. మొత్తంగా చూస్తుంటే కరోనా పై సీఎం జగన్ యుద్ధం ప్రకటించినట్టు అర్థమవుతుంది.

ఇకపోతే ,రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ ని దాటింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6051 కొత్త కేసులు నమోదవగా.. మరో 49 మంది మరణించారు. తాజా లెక్కలతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. ఇప్పటి వరకు 1090 మంది చనిపోయారు.49,558 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 51,701 యాక్టివ్ కేసులున్నాయి.
Tags:    

Similar News