సాధినేనిపై కేసు నమోదు.. కమలనాథులకు కోపమొచ్చింది

Update: 2020-08-16 05:30 GMT
తెలుగుదేశం పార్టీ నేతగా.. తన వ్యాఖ్యలతో తరచూ అందరిని ఆకర్షించే సాధినేని యామిని ఆ మధ్యన బీజేపీలోకి చేరటం తెలిసిందే. టీడీపీ నేతగా ఉన్నప్పుడు ఆమె చాలా యాక్టివ్ గా ఉండేవారు. బీజేపీలో అప్పుడప్పుడు కొన్ని అంశాల మీదనే స్పందిస్తున్నారు. ఇటీవల అయోధ్యలోని రామాలయ శంకుస్థాపన వేళ.. టీటీడీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయని వైనంపై పలువురు విమర్శలు చేయటం.. దీనిపై టీటీడీ వివరణ ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై సాధినేని యామిని సైతం విమర్శలు చేశారు టీటీడీ తీరును తప్పు పట్టారు.

ఈ వ్యాఖ్యలపై టీటీడీకి కోపం వచ్చింది. తమ సంస్థపై యామిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటం.. ఆమెపై కేసు బుక్ కావటం జరిగిపోయాయి. దీనిపై బీజేపీ సీరియస్ అవుతోంది. తన ఆవేదనను మాత్రమే ఆమె తెలియజేశారు. టీటీడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఆమె చేయలేదు.. అంతమాత్రానికే కేసు పెట్టేస్తారా? అన్నది కమలనాథుల వాదన.

దీనికి తగ్గట్లే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘శతాబ్దాల కల.. అయోధ్యలోని రామాలయం శంకుస్థాపన. ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేసిన నేపథ్యంలో కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి టీటీడీలో ప్రచారం చేయకపోవటం అంటే.. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం. దీనిపై బీజేపీలో ఉన్న అనేక మంది ప్రస్తావించారు.యామినిగారి మీద కేసు పెట్టటం మంచిది కాదు. ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి’’ అంటూ ట్వీట్లు చేశారు.

మరి.. సోము చేసిన ట్వీట్ డిమాండ్ పై ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ప్రశ్నగా మారింది. ఆమెపై టీటీడీ విజిలెన్సు విభాగం పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటుందా? అదే తీరులో కొనసాగిస్తుందా? అన్న ప్రశ్న. సాధినేని యామినిపై కేసు నమోదు చేయటాన్ని తప్పు పట్టి.. కేసు ఎత్తేయాలని డిమాండ్ చేసిన సోముపైనా ఫిర్యాదు చేయరు కదా? అంటూ బీజేపీ నేతలు కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సాధినేనిపై నమోదు చేసిన కేసుపై బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News