మరో సర్వే ఫలితం.. బైడెన్ వెంటే ఆసియా- అమెరికన్లు

Update: 2020-11-01 08:50 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన  పోలింగ్ గంటల్లోకి వచ్చిన వేళ.. మరో సర్వే ఫలితం వెల్లడైంది. 2020 కార్పొరేటివ్ ఎలక్షన్ స్టడీ పేరుతో నిర్వహించిన సర్వేను సెప్టెంబరునుంచి అక్టోబరు మధ్య వరకు నిర్వహించారు.ఆన్ లైన్ లో దాదాపు 71 వేల మందితో నిర్వహించిన సర్వేలో ఆసియా అమెరికన్లు డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ వెంటే ఉన్నట్లు తేల్చారు.

తాజా సర్వేలో తేలిన అంశాల్ని చూస్తే.. బైడెన్ కు 51 శాతం మంది మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ నకు 43 శాతం మంది మద్దతు ఇస్తున్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులు బైడెన్ కే తమ ఓటు అని చెబుతుంటే.. 65 ఏళ్ల వయసు వారు మాత్రం ట్రంప్ వెంట ఉండటం గమనార్హం. ఆసియా అమెరికన్ల విషయానికి వస్తే.. 65 శాతం మంది తమ ఓటు బైడెన్ కు అని స్పష్టం చేస్తుంటే.. 28 శాతం మంది మాత్రం ట్రంప్ కు ఓటు వేస్తానని తేల్చటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నల్లజాతీయులు పెద్ద ఎత్తున బైడెన్ వెంట నిలిచారు. రికార్డు స్థాయిలో 86 శాతం మంది తమ ఓటు బైడెన్ అని చెప్పేస్తున్నారు. ట్రంప్ వైపు కేవలం 9 శాతం మంది మాత్రమే నిలుస్తున్నారు. ఇంత భారీ వ్యత్యాసం చాలా అరుదుగా ఉంటుందంటున్నారు. స్పానిష్ భాష మాట్లాడే అమెరికన్లలో 59 శాతం మంది బైడెన్ వెంట ఉన్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో హిల్లరీకిఓటు వేసిన వారిలో 95 శాతం మంది ఓటర్లు బైడెన్ కు ఓటు ఖాయంగా వేస్తామని చెబుతుంటే.. అదే ఎన్నికల్లో ట్రంప్ కు ఓటు వేసిన వారిలో 90 శాతం మంది మాత్రమే తాజాగా మరోసారి ట్రంప్ కు ఓటు వేస్తామని చెప్పటం గమనార్హం.

మహిళల్లో 55 శాతం మంది బైడెన్ వెంట ఉంటే.. 39 శాతం మంది ట్రంప్ వెంట ఉన్నారు. అదే సమయంలో పురుషులు ట్రంప్ వైపు కాస్త ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ కు 48 శాతం అనుకూలంగా ఉంటే.. బైడెన్ వెంట 47 శాతం మంది ఉన్నారు. డిగ్రీ కూడా చదవని అమెరికన్లు అత్యధికం ట్రంప్ వైపు ఉండటం గమనార్హం. వీరిలో 57 శాతం మంది ట్రంప్ వైపు ఉంటే.. బైడెన్ వైపు 38 శాతమే ఉన్నారు. అదే సమయంలో డిగ్రీ ఉన్న అమెరికన్లలో బైడెన్ వెంట 58 శాతం మంది ఉంటే.. ట్రంప్ వెంట 36 శాతం మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే.. ట్రంప్ తో పోలిస్తే.. బైడెన్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్న వైనం కనిపిస్తుంది.
Tags:    

Similar News