బీజేపీకి మరో ఎదురుదెబ్బ

Update: 2021-05-06 05:30 GMT
దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని స్పష్టమైంది. అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లోనూ కమలదళానికి చేదు అనుభవం ఎదురైంది. ఆ రాష్ట్రంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ కంటే బీజేపీ వెనుకంజలో నిలిచింది. ఈ పరిణామం బీజేపీ నేతలకు షాకింగ్ గా మారింది.

ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక డీలాపడ్డ బీజేపీకి యూపీలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. యూపీలో నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ కంటే కూడా బీజేపీ వెనుకబడింది.

మొత్తం 3050 స్థానాలకు గాను బీజేపీ మద్దతుదారులు కేవలం 599 స్థానాల్లోనే గెలిచారు.  సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) 790, బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) 354 సీట్లలో గెలిచాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 1247 స్థానాల్లో గెలిచారు.

స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ స్థానంలో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్ పూర్ లోనూ బీజేపీని ప్రజలు తిరస్కరించడం సంచలనమైంది.

కీలకమైన జిల్లాల్లో బీజేపీకి ఇలాంటి షాక్ తగలడం కమలనాథులను జీర్ణించుకోనివ్వడం లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు , మరణాలు పెరగడం.. వైరస్ కట్టడిలో బీజేపీ సర్కార్ విఫలమైందన్న ఆరోపణలతో ఆ పార్టీకి ఓటర్లు బుద్ది చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News