హైదరాబాద్ ఐటీ సిగలో మరో కలికితురాయి

Update: 2019-08-08 06:00 GMT
హైదరాబాద్ సిగలో మరో ఐటీ సెజ్ చేరుతోంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ లో గూగుల్ - ఇన్ఫోసిస్ - టీసీఎస్ - ఫేస్ బుక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఐటీ విస్తరణకు తోడ్పాటును అందించాయి.

తెలంగాణ ప్రభుత్వం కూడా పారిశ్రామికాభివృద్ధికి చేపట్టిన టీఎస్ ఐపాస్ తో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇన్నాళ్లు బెంగళూరు ఐటీ హబ్ గా ఉండగా.. దానికి పోటీగా హైదరాబాద్ దూసుకువస్తోంది. మౌళిక వసతులు - పర్మిషన్లు - సరళతర వాణిజ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఐటీ కంపెనీల రాక మొదలైంది.

తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (వీఎస్ ఈజడ్) కమిషనర్ ఆవుల రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో మరో ఐటీ సెజ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా నానక్ రాంగూడ ప్రాంతంలో 2.9 హెకార్ట విస్తీర్ణంలో ‘మెహతా ఇన్ ఫర్మేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఐటీ సెజ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రూ.1147.44 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపారు.

ఈ భారీ ఐటీ సెజ్ హైదరాబాద్ ఐటీకి గొప్ప ఊతంగా పరిణమిస్తోందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెజ్ ఏర్పాటు వల్ల 11620 మందికి ప్రత్యక్షంగా - పరోక్షంగా మరో 1250 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఐదేళ్లలో రూ.2088.42 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

కాగా తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ వేసిన అడుగులు - పారదర్శకత - ప్రోత్సాహం  ఇప్పుడు తెలంగాణకు ఐటీ కంపెనీలు తరలిరావడంతో తోడ్పాటునందిస్తోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇది తెలంగాణ ఐటీకి ఊతమిస్తోందంటున్నారు.


Tags:    

Similar News