దీదీ టైం బాగోలేనట్లుందే.. తాజాగా మరో షాక్

Update: 2020-12-18 04:10 GMT
మొండితనం.. అంతకు మించిన పట్టుదల వెరసి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆభరణాలుగా చెప్పాలి. తాను పాలిస్తున్న బెంగాల్ కోటలోకి ప్రత్యర్థుల రాకుండా ఉండేందుకు ఆమె చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. చూసేందుకు సింఫుల్ గా ఉన్న.. సివంగికి మించిన చురుకుదనం ఆమె సొంతం. మరికొద్ది నెలల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

ముచ్చటగా మూడోసారి.. ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మమత. అదే సమయంలో.. ఈసారి ఆమెకు షాకిచ్చి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇలాంటి వేళ.. మజ్లిస్ పార్టీ కూడా పశ్చిమబెంగాల్ వైపు ఫోకస్ చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా.. ఒకరితర్వాత ఒకరు చొప్పున బెంగాల్ కోటను సొంతం చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నాలు దీదీని ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆమె పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ.. అసన్ సోల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థాగత సమస్యల్ని పార్టీ హైకమాండ్ సకాలంలో తీర్చలేదన్నది అతడి ఆరోపణ. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

ఈ పరిణామాలన్ని మమతకు కొత్త టెన్షన్ పుట్టించటమే కాదు.. లెక్క తేడా కొడుతున్న భావన కలుగుతోంది. ఇలాంటి పరిణామాలు పార్టీలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయటంతో పాటు.. గోడ మీద పిల్లి మాదిరి ఉన్న నేతలు పలువురు జంప్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. గత నెలలోనే సీఎం మమతతో విభేదించిన సువేందు తన మంత్రి పదవిని వదులుకోవటం గమనార్హం. తాజాగా ఆయన బీజేపీలో చేరనున్నారు. మరో సీనియర్ నాయకుడు దీప్తంగ్షు చౌదరి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.

ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేయటం దీదీపార్టీపైన ఒత్తిడిని పెంచుతోంది. అధికార పార్టీకి ముగింపునకు నాంది అని.. ఆ పార్టీ ఇప్పుడు పేకమేడలా కూలిపోతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. త్వరలోనే మమత పార్టీకి చెందిన పలువురునేతలు తమ పార్టీలోకి చేరనున్నట్లు వెల్లడించారు. ఈ వార్తలన్ని బెంగాల్ సీఎంకు ఏ మాత్రం శుభసూచకం కాదంటున్నారు. గతంలో తానెప్పుడు ఎదుర్కోని పరిణామాలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్న వేళ.. ఆమె ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News