జగన్ పేరు చెప్పి వైసీపీ మహిళా ఎమ్మెల్సీకే మోసం

Update: 2020-09-09 07:15 GMT
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే మస్కా కొడుతున్నారు. రుణం, నిధుల పేరుతో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీకే టోకరా వేసిన వైనం విస్తుగొలుపుతోంది. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

వైసీపీ మహిళా ఎమ్మెల్సీకి సీఎం జగన్ కార్యాలయం పేరు చెప్పి మస్కా కొట్టేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తన పేరు బాబు జగ్జీవన్ రామ్ అని.. సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. మీరు రూ.50వేలు డిపాజిట్ చేస్తే ప్రభుత్వం రూ.25 లక్షల రుణం ఇస్తుందని నమ్మబలికాడు.

డబ్బులు వేసేందుకు తెలంగాణలోని జగ్గారెడ్డి గూడెం బ్యాంకు అకౌంట్ నంబర్ ను పంపించాడు. దీంతోపాటు సీఎం కార్యాలయం పేరు చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. జకియా ఖానమ్ వెంటనే జరిగిన విషయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సీఎం కార్యాలయంలో దీనిపై ఆరాతీశారు.

దీంతో బాబు జగ్జీవన్ రావు పేరుతో ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఆరాతీశారు. అలాంటి వారు ఎవరూ లేరని విప్ శ్రీకాంత్ రెడ్డి.. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్ సీఐని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News