గోల్కొండ కోటలోని నయాఖిలా కింద మరో నగరం?

Update: 2019-12-15 04:31 GMT
చరిత్రను కళ్లకు కట్టేలా చెప్పే గోల్కొండ కోట కింద ఏముంది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గోల్కొండ కోటలోని నయాఖిలా కింద భూగర్భంలో భారీ భవనం ఉందా? అన్న సందేహం అంతకంతకూ బలపడుతోంది. సైంటిఫిక్ క్లియరెన్స్ కోసం కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గడిచిన పది రోజులుగా జరుపుతున్న తవ్వకాలు కొత్త ఆలోచనలకు ఊపిరిపోస్తున్నాయి.

ఎందుకంటే.. రెండు అడుగుల లోతుకు తవ్విన వెంటనే.. పురాతన శిథిలాలు వెలుగు చూస్తున్న వైనంతో.. గోల్కొండ కోటలోని నయాఖిలా కింద భారీ భవంతి ఉండే అవకాశం ఉందన్న ఆలోచనకు బలం చేకూరుతోంది. ఇంతకీ అసలీ తవ్వకాలు ఎందుకోసం చేస్తున్నట్లు? అన్న ప్రశ్నలోకి వెళితే.. గొల్కోండ పక్కనే హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ కు ఉమ్మడి రాష్ట్రంలో 212 ఎకరాల్ని అప్పగించారు. గోల్ఫ్ క్లబ్ ను విస్తరిస్తున్నామని.. నయాఖిలాలో ఖాళీగా ఉన్న 40 ఎకరాల్లో 30 ఎకరాల భూమి తమకు ఇవ్వాలని కేంద్ర పురావస్తు శాఖను సదరు సంస్థ కోరింది. తమ అధీనంలో ఉన్న భూమిని ఎవరికైనా అప్పగించాలంటే అక్కడ సైంటిఫిక్ క్లియరెన్సు ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకవేళ అక్కడ జరిపే తవ్వకాల్లో ఏమైనా బయటపడితే.. ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. గడిచిన పదిరోజులుగా జరుపుతున్న తవ్వకాల్లో పలు చారిత్రక అవశేషాలు బయటపడుతున్నాయి. దీంతో.. నయాఖిలా కింద ఏదైనా పెద్ద భవనం ఉండి ఉంటుందన్న అనుమానం వ్యక్తమవుతోంది.

గోల్కొండ కోట నుంచి నయాఖిలా కింది భాగానికి సొరంగమార్గంలో ఏమైనా ఏర్పాటు ఉందా? ఏకాంతంతో పాటు ప్రత్యేక రక్షణ కోసం ఖుతుబ్ షాహీ రాజులు రహస్య భవనాన్ని నిర్మించి ఉంటారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.తాజా తవ్వకాలు ఈ కొత్త ఆలోచనలకు తెర తీస్తున్నాయి. తాజాగా బయటపడుతున్న శిధిలాల నేపథ్యంలో నిపుణులతో తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నారు.

13వ శతాబ్దంలో గోల్కొండ కోటను కాకతీయులు స్టార్ట్ చేస్తే అబ్దుల్లా ఖుతుబ్ షాహీ పాలనలో నయాఖిలా నిర్మాణం జరిగినట్లు చెబుతారు. గోల్కొండ కోటకు దూరంగా నిర్మించిన నయాఖిలాలోకి రాజ కుటుంబీకులకు మాత్రమే ప్రవేశం ఉండేది. మరింత లోతుగా తవ్వకాలు జరిపితే.. సరికొత్త విశేషాలు బయటకు వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News