పౌరసత్వ బిల్లుపై బంగ్లాదేశ్ కు కోపమొచ్చిందట!

Update: 2019-12-12 10:46 GMT
జాతీయ పౌరసత్వ బిల్లు లోక్ సభలోనూ.. రాజ్యసభలోనూ ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆమోదం పొందటం తెలిసిందే. తన ఎజెండాలో భాగంగా ఎన్నికల వేళలో తామిచ్చిన హామీల్ని అమలు చేసే పనిలో మోడీ సర్కారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లకు పైబడిన స్వతంత్ర భారతంలో కేంద్ర ప్రభుత్వం ఒకటి వివాదాస్పద అంశాల్ని ఒక్కొక్కటిగా లెక్క తేల్చేస్తున్న వైనం చూస్తే.. ఇంతకాలం ఎందుకు నానబెట్టారన్న సందేహం కలుగక మానదు.

ఆర్టికల్ 370 నిర్వీర్యం.. ఇతర అంశాల్లో వ్యతిరేకత రాకుండా నిరోధించటంలో సఫలమైన మోడీ సర్కారు తాజాగా జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో నిరసనలు తలెత్తకుండా చేయటంలో విజయవంతం కాలేదన్న మాట వినిపిస్తోంది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటంపై ఈశాన్య భారత రగిలిపోతోంది. ఈ సమస్య ఇలా ఉంటే.. తాజాగా ఇరుగుపొరుగు దేశాల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి చేసిన తాజా వ్యాఖ్యల్ని చెప్పాలి.

భారతదేశం లౌకికవాదాన్ని విశ్వసిస్తున్న దేశమని.. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కారణంగా చారిత్రాత్మకంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం అది బలహీనపడే అవకాశం ఉందన్నారు. పౌరసత్వ బిల్లుపై కేంద్రమంత్రి అమిత్ షా తీరును ఆయన తప్పు పట్టారు.

ఇంతకీ బంగ్లాదేశ్ కు పౌరసత్వ బిల్లుతో వచ్చిన ఇబ్బందేమిటన్నది చూస్తే.. పౌరసత్వ బిల్లులో పీడనకు గురయ్యే మైనార్టీలున్న పాక్.. అఫ్ఘానిస్థాన్ లతో పాటు బంగ్లాదేశ్ కూడా ఉందన్నది మర్చిపోకూడదు. ఇది ఆ దేశానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేసింది. మతసామరస్యం ఉండే అతి కొద్ది దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటని చెప్పుకున్న బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మేనన్.. తాజా బిల్లులో తమ దేశాన్ని చేర్చటంపై అసహనాన్ని వ్యక్తం చేశారు.

భారత్ ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని.. వాటితో పోరాడాలన్న ఆయన.. స్నేహపూర్వకంగా ఉండే తమ మీద వాటిని రుద్దకూడదన్న వ్యాఖ్యను చేయటం గమనార్హం. ఇరుదేశాల మధ్య ఉన్న సత్ సంబంధాల మీద ప్రభావం పడకూడదన్న మాట ఆయన నోటి నుంచి రావటం చూస్తే.. పౌరసత్వ బిల్లు ఆ దేశాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. మరింత గింజుకునే బంగ్లాదేశ్.. తమ దేశంలోని మైనార్టీల విషయంలో అంతే శ్రద్ధ చూపి.. వారి హక్కులకు భంగం కలిగించకుండా చూస్తే బాగుండేది కదా? ఎంతైనా నిజం చేదుగా ఉంటుందన్న మాట బంగ్లా విదేశీ వ్యవహారాల మంత్రి మాటల్ని చూస్తే అర్థం కాక మానదు.


Tags:    

Similar News