మోడీ నీడ నోటి నుంచి ‘రజనీ’ మాట.. ఏం జరుగుతోంది?

Update: 2020-10-19 06:15 GMT
మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎంత ప్రయత్నించినా.. తమకు ఏ మాత్రం కొరుకుడుపడని తమిళనాడు మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది బీజేపీ. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో ఖాతా తెరవటంతో పాటు.. పార్టీ ఉనికిని దేశానికి తెలియజేయటం ద్వారా.. తమకు తిరుగులేదన్న విషయాన్ని స్పష్టంచేయాలన్న తపన ఆ పార్టీలో కనిపిస్తోంది.

ఇదే విషయాన్ని తనదైన శైలిలోచెప్పారు అమిత్ షా. మోడీకి నీడగా అభివర్ణించే అమిత్ షా నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే.. తమిళనాడు విషయంలో తామెంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము 60 స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోఆయన వెల్లడించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తమిళనాడులో 30 శాతం కంటే తక్కువ స్థానాలకే పరిమితం కావటం చూస్తే.. ఆ పార్టీ మరే పార్టీతో అయినా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి.

దీనికి తగ్గట్లే.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టే పార్టీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు అమిత్ షా తనదైన శైలిలో బదులిచ్చారు. ఇంకా ప్రకటించని రజనీ పార్టీ గురించి తొందరపడి వ్యాఖ్యలు చేయని ఆయన.. అలాంటి అవకాశం ఏమీ లేదంటూ తలుపులు మూయకుండా ఉండటం చూస్తే.. సమ్ థింగ్..సమ్ థింగ్ అన్న భావన కలుగక మానదు. తమిళనాడులో ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం ఉందని.. రజనీకాంత్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో రాలేదుగా? పార్టీ కూడా ఏర్పాటు చేయలేదుగా? అంటూ ఎదురు ప్రశ్నల్ని సంధించారు అమిత్ షా.

తమిళనాడు రాజకీయాల్ని తాము నిశితంగా పరిశీలించామని.. బలం పుంజుకోవటానికి తాము ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామని చెప్పటం ద్వారా.. ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్న వైనాన్ని షా చెప్పారని చెప్పాలి.  మరి.. తమిళ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద చర్చ షురూ కావటం ఖాయం.
Tags:    

Similar News