గూగుల్ పై కేసు పెట్టిన అమెరికా ..కారణం ఏంటంటే ?

Update: 2020-10-21 13:30 GMT
నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌ సెర్చ్‌, ఆన్‌ లైన్‌ అడ్వర్టైజింగ్‌ లో  గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం గూగుల్ సంస్థ పై కేసు పెట్టింది. అమెరికా ప్రభుత్వం ఒక టెక్ దిగ్గజ సంస్థ పై చేసిన అతి పెద్ద ఆరోపణ ఇదే అంటూ నిపుణులు తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. అమెరికా నుంచి దేశీయంగా, విదేశాలలో బిజినెస్‌లు చేస్తున్న సంస్థల వ్యాపార శైలిపై ప్రభుత్వం ఏడాది కాలంగా నిఘా పెట్టింది. గూగుల్‌ అనేది ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారంలాంటిది. సెర్చి ,అడ్వర్టైజిం ‌ దిగ్గజం. అయితే, పోటీ సంస్థలకు హానికరమైన అనుచిత విధానాలతో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసింది అని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ జెఫ్‌ రోసెన్‌ తెలిపారు.  ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

మొబైల్  ఫోన్లలో గూగుల్ ‌ను డిఫాల్ట్‌ సెర్చి ఇంజిన్ ‌లా ఉంచేందుకు మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలకు గూగుల్‌ భారీగా చెల్లింపులు జరుపుతోందని, ఇందుకోసం ప్రకటనకర్తల నుంచి వచ్చే నిధులను వెదజల్లుతోందని పిటీషన్‌ లో న్యాయశాఖ ఆరోపణలు గుప్పించింది. అమెరికా ప్రభుత్వ న్యాయ విభాగంతోపాటు 11 రాష్ట్రాలు గూగుల్‌ పై ఈ ఆరోపణలు చేశాయి. చివరకు ఈ సంస్థ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందంటే గూగుల్ అన్న పదం ఒక కంపెనీ పేరులాగా కాక, సెర్చ్‌ ఇంజిన్‌ అనే మాటకు పర్యాయ పదంలా మారింది అని ఈ లా సూట్‌లో ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న తరుణంలో నమోదైన ఈ ఫిర్యాదు, తాము రెండోసారి అధికారంలోకి వస్తే ప్రజలను ప్రభావితం చేసే సంస్థలను అవసరమైతే సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ ప్రభుత్వం సందేశం ఇచ్చినట్టుగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని, అనేక లోపాలున్నాయని గూగుల్ వ్యాఖ్యానించింది. కస్టమర్‌ ఫస్ట్‌ నినాదంతో ప్రత్యర్ధి సంస్థల నుంచి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో వ్యాపారం నిర్వహిస్తున్నామని గూగుల్ అన్నది.గూగుల్ ఉత్పత్తులు వాడాలంటూ కస్టమర్లను ఎవరూ ఒత్తిడి చేయడం లేదు. వాళ్లే స్వచ్ఛందంగా మా ఉత్పత్తులను వాడుతున్నారు అని గూగుల్ స్పష్టం చేసింది. గతంలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి కూడా గూగుల్‌ పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈయూ 8.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది.
Tags:    

Similar News