కాంగ్రెస్ కు షాకిచ్చిన ఆ నటుడు

Update: 2018-04-24 10:47 GMT
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో పెద్ద నాయకుడైన అంబరీష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన ఆయన.. అందుకు నిరాకరించడమే కాక.. రాజకీయాలకే టాటా చెప్పేశారు. వయోభారం - అనారోగ్యం కారణంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. తాను ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనబోనని అంబరీష్ తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిపోయింది. నటుడిగానే కాక వ్యక్తిగానూ మంచి ఇమేజ్ ఉన్న అంబరీష్ ఎన్నికల ముంగిట ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే.

దీంతో అంబరీష్ స్థానంలో మరో నాయకుడిని మండ్యలో నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు జరుపుతోంది. మండ్య అసెంబ్లీ స్థానానికి అంబరీష్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయన బీఫాం తీసుకోలేదు. పార్టీకి అనేక షరతులు విధిస్తూ ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే బీఫాం తీసుకుంటానని అన్నట్లుగా వార్తలొచ్చాయి. అలాగే తన బదులు భార్య సుమలతకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరినట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కొందరు అగ్ర నేతలు అంబరీష్ తో చర్చలు కూడా జరిపారు. మరి మంత్రి పదవి కోసం ఆశపడిన వ్యక్తి ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడమేంటో ఎవరికి అర్థం కావడం లేదు. మరి రాబోయే రోజుల్లో  ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారేమో చూడాలి.
Tags:    

Similar News